Fact Check: 


పాలస్తీనాకి పుతిన్ సపోర్ట్..? 


ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య దాదాపు రెండు నెలలుగా యుద్ధం (Israel-Hamas War) కొనసాగుతోంది. గాజాని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయేల్ సైన్యం విరుచుకుపడుతోంది. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడి యుద్ధ వాతావరణాన్ని భరించలేక వలస వెళ్లిపోయారు. మధ్యలో ఓ వారం రోజుల పాటు కాస్త విరామం ఇచ్చినా మళ్లీ బాంబుల మోతలు మొదలయ్యాయి. ఈ యుద్ధంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అమెరికా సహా భారత్‌ ఇజ్రాయేల్‌కి మద్దతునిచ్చాయి. అయితే..రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాత్రం పాలస్తీనాకు మద్దతు ఇచ్చారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. రష్యా అధికారికంగా పాలస్తీనాకు మద్దతునిస్తున్నట్టుగా ఉంది ఈ వీడియోలో. పుతిన్ ఈ ప్రకటన చేసిన వెంటనే రష్యా సైనికులు "హుర్రే హుర్రే" అని గట్టిగా అరిచారు. ఈ వీడియోని అప్‌లోడ్ చేశారు కొందరు యూజర్స్. "రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధికారికంగా పాలస్తీనాకు మద్దతునిచ్చారు. మనల్ని ఇంకెవరూ ఆపలేరు" అంటూ ప్రచారం చేశారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో ఈ వీడియో (వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి) బాగా షేర్ అయింది. అయితే...ఇది నిజమా కాదా అని తెలుసుకోకుండానే చాలా మంది పాలస్తీనా సపోర్టర్స్ షేర్ చేశారు. దీనిపై ఫ్యాక్ట్‌ చెక్‌ చేస్తే ఇది నిజం కాదని తేలింది. పాలస్తీనాకు మద్దతునిస్తున్నట్టు పుతిన్‌ అసలు ఏమీ మాట్లాడలేదు. 



Image Source: Facebook


ఇదీ నిజం..


Logically Facts ఆ రష్యన్ లాంగ్వేజ్‌లో ఉన్న వీడియోని ట్రాన్స్‌లేట్ చేసింది. ఈ వీడియోలు పుతిన్ పాలస్తీనా గురించి ప్రస్తావించలేదని వెల్లడించింది. రష్యాన్ని పొగుడుతూ కొన్ని స్లోగన్స్ చేశారట. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ వీడియో ఎప్పటిదో కూడా తేల్చింది Logically Facts.2021లో మే 9న మాస్కోలో జరిగిన విక్టరీ డే పరేడ్‌లో ఈ కామెంట్స్ చేశారు పుతిన్. రష్యన్ న్యూస్‌పేపర్‌కి చెందిన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ అయింది ఈ వీడియో. అందులో 15 సెకన్ల వీడియోని ఎడిట్‌ చేసి పాలస్తీనా గురించి పుతిన్ మాట్లాడారంటూ తెగ ప్రచారం చేశారు. Great Patriotic War లో విజయానికి గుర్తుగా ఏటా మాస్కోలో ఈ పరేడ్ నిర్వహిస్తారు. ఆ సమయంలోనే తమ దేశం గురించి గొప్పగా మాట్లాడుతూ నినాదాలు చేశారు పుతిన్. మరో కీలక విషయం ఏంటంటే...అప్పటి పుతిన్ స్పీచ్‌కి సంబంధించిన పూర్తి ఇంగ్లీష్ స్క్రిప్ట్ President of Russia వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. ఆ సమయంలో అసలు పుతిన్‌ పాలస్తీనాకు మద్దతునిస్తున్నట్టుగా ఒక్క మాట కూడా అనలేదు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని తేలింది. 


 



Disclaimer: This report first appeared on logicallyfacts.com, and has been republished on ABP Live as part of a special arrangement.


Also Read: Fact Check: కాంగ్రెస్ ప్రచార ర్యాలీలో పాకిస్థాన్ జెండా అంటూ వీడియో వైరల్ - ఇందులో నిజమెంత?