Sandeep Reddy Vanga on Javed Akhtar: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన ‘యానిమల్’. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా దుమ్మురేపింది. ఈ చిత్రం ఏకంగా రూ. 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో తీవ్రమైన హింస, మహిళలను చులకన చేసే సన్నివేశాలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ కూడా ఈ సినిమాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘యానిమల్’ లాంటి సినిమాలు సమాజానికి చాలా ప్రమాదం అన్నారు. తాజాగా జావేద్ వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి వంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

  


నీ కొడుక్కి కూడా ఇలా చెప్తే బాగుండేది- సందీప్ రెడ్డి వంగా


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా, జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే తను సినిమా చూడలేని అర్థం అవుతుందన్నారు. సినిమా మొత్తం చూస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదన్నారు. సినిమా చూడకుండా మాట్లాడేవారి గురించి ఏం చెప్పాలి? అంటూ ప్రశ్నించారు. ఎదుటి వారి గురించి మాట్లాడే ముందు తమ గురించి కూడా ఆలోచించుకుంటే మంచిదన్నారు. ‘‘మీర్జాపుర్‌’ వెబ్ సిరీస్‌లో బోలెడు అభ్యంతరకర పదాలున్నాయి. ఆ సీరిస్ నిర్మించింది జావేద్ అక్తర్ కొడుకు ఫర్హాన్ అక్తర్. ప్రపంచంలోని బూతులు అన్నీ ఆ సిరీస్ లోనే ఉన్నాయి. నేను కూడా ఆ సిరీస్ ను పూర్తిగా చూడలేదు. యాడ్స్ లో వచ్చిన సన్నివేశాలనే చూశాను. ఆ డైలాగులు వింటే వాంతికి వచ్చినట్టు అయ్యింది. ముందు తన కొడుకు నిర్మించే సినిమా గురించి మాట్లాడి, ఆ తర్వాత ఇతరుల సినిమాల గురించి అభిప్రాయాలను చెప్తే బాగుంటుంది” అంటూ సందీప్ కౌంటర్ ఇచ్చారు.  


అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్‌లో జావేద్ కామెంట్స్


కొద్ది రోజుల క్రితం  ఔరంగాబాద్‌లో జరిగిన అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్న సినిమాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సినిమాలో ఓ పురుషుడు స్త్రీతో షూని నాకమని చెప్పడం, చాచి చెంపమీద కొట్టడం మంచిదే అని చెప్పే సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. అది చాలా ప్రమాదకరం” అని అభిప్రాయపడ్డారు. ‘యానిమల్’, ‘కబీర్ సింగ్’ సినిమాల్లోని   సన్నివేశాలను ఉదహరిస్తూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.


సందీప్ వ్యాఖ్యలపై స్పందించిన కిరణ్ రావు


అటు ‘యానిమల్’ సినిమా గురించి ఆమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి రీసెంట్ గా స్పందించారు. ఆమె భర్త నటించిన ‘దిల్’ సినిమా గురించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఈ వ్యాఖ్యలపై కిరణ్ రావు స్పందించారు. తాను స్పెషల్ గా సందీప్ సినిమాల గురించి మాట్లాడలేదన్నారు. కొన్ని సినిమాల్లో స్త్రీలను కించపరిచేలా సన్నివేశాలు ఉంటున్నాయని మాత్రమే చెప్పానన్నారు. ఆయన సినిమాల గురించే మాట్లాడానని సందీప్ ఎందుకు అనుకున్నారో తనకు అర్థం కాలేదన్నారు.     


Read Also: మొయిద్దీన్ భాయ్‌గా ర‌జనీకాంత్‌, పవర్ ఫుల్ యాక్టింగ్‌తో అదరగొట్టిన సూపర్ స్టార్