ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా మరణించడంతో, హార్ట్ ఎటాక్‌పై అనేక చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే ఈ ప్రాణాంతక సమస్య వచ్చేది, ఇప్పుడు యువతరాన్ని కూడా వదలడం లేదు. గుండె పోటు కలిగినప్పుడు మొదటి రెండు నుంచి మూడు నిమిషాలు చాలా ముఖ్యమైనవి. మన కళ్ల ముందు ఎవరైనా గుండె పోటుకు గురైతే ఏం చేయాలో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం అవగాహనా కార్యక్రమాలు యూట్యూబ్ లో నడుస్తున్నాయి. అలాగే ప్రముఖ వైద్యులు ముఖర్జీ తన యూట్యూబ్ ఛానెల్ లో గుండె పోటు వచ్చిన వ్యక్తికి మొదటి అయిదు నిమిషాల్లో ఎలాంటి ప్రాథమిక చికిత్స అందించాలో ఓ వీడియో ద్వారా వివరించారు. ఆ వీడియోలో అతిధిగా టాప్ డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నారు. ఆయన గుండె పోటు వచ్చిన వ్యక్తికి ఎలా సీపీఆర్ ఇవ్వాలో మాక్ డ్రిల్ చేసి చూపించారు.
వీడియోలో చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తి గుండె పోటుకు గురై చలనం లేకుండా పడి ఉన్నప్పుడు అతడిని ముందు నేలపై తిన్నగా పడుకోబెట్టాలి. ఈలోపే ఎవరినైనా 108కి లేదా దగ్గర్లోని ఆసుపత్రి అంబులెన్స్ కు ఫోన్ చేసి ‘ఏఈడీ’తీసుకుని రమ్మని చెప్పాలి. సమయం వేస్టు చేయకుండా సీపీఆర్ మొదలుపెట్టాలి.ఎడమచేయి బేస్‌ని ఛాతీపై ఉండి వీడియోలో చూపించినట్టు కుడి చేత్తో పట్టుకోవాలి. బలన్నంతా ఉపయోగించి ఛాతీపై నొక్కాలి. ఎంతగా అంటే సెకనుకు రెండుసార్లు గట్టిగా ఒత్తాలి (వీడియోల చూపించినట్టు). అలా ఆగకుండా కనీసం 30 సార్లు చేయాలి. తరువాత నోట్లో నోరు పెట్టి గాలి ఊదాలి. మళ్లీ సీపీఆర్ చేయాలి. అంబులెన్స్ వచ్చే వరకు ప్రక్రియ కొనసాగాలి. కొన్ని సార్లు తిరిగి గుండె కొట్టుకునే అవకాశం ఎక్కువ. గుండె పోటు అధికంగా సంభవిస్తున్న రోజుల్లో సీపీఆర్ ప్రక్రియ గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.