టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్ ( VK Naresh ) మాజీ భార్య రమ్య రఘుపతి పలువురు వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు. ఆమె నరేష్ పేరు చెప్పి ఈ అప్పులు చేసినట్లుగా తెలుస్తోంది. నరేష్‌కు సంబంధించిన ఆస్తులు చూపించి పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నారని వాటిని తిరిగి చెల్లించమంటే సమాధానం చెప్పడం లేదని పలువురు బాధితులు వాపోతున్నారు. హిందూపురం, అనంతపురం, హైదరాబాద్‌లలో ఈ అప్పులు చేసినట్లుగా తెలుస్తోంది.


అనంతపురం జిల్లాకు చెందిన రమ్య రఘుపతిని ( Ramya Raghupati ) నరేష్ పదేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. ఆమె అనంతపురం జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రికి  బంధువుని తెలుస్తోంది. అప్పట్లో భారతీయ జనతాపార్టీలో ( BJP ) ఉన్న నరేష్ ఆ పార్టీ తరపున అనంతపురం జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. పలుమార్లు పోటీ చేశారు. కానీ ఎప్పుడూ విజయం సాధించలేదు. హిందూపురంలో ( Hindupur ) రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో రమ్య రఘుపతిని నరేష్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు వారు కలిసే ఉన్నారు. నరేష్ పలు టీవీ చానళ్లకు ఇంటర్యలను కలిసే ఇచ్చారు. అయితే ఆ తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఏడేళ్లుగా విడిగా ఉంటున్నామని నరేష్ చెబుతున్నారు. 


అయితే రమ్య రఘుపతి మాత్రం తాను నరేష్ భార్యననే చెబుతూ పలువురి వద్ద అప్పులు తీసుకోవడం ప్రారంభించారు. రమ్య ఫై గచ్చిబౌలి ( Gachibowli ) పోలీస్ స్టేషన్‌లో ఐదుగురు మహిళలు ఫిర్యాదులు చేశారు. నరేష్  కుటుంబ ఆస్తులు చూపెట్టి డబ్బులు వసూల్ చేశారని ఆ మహిళలు ఫిర్యాదు చేశారు.   కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే  రమ్య వసూళ్లతో సంబంధం లేదని నరేష్ స్పష్టం చేస్తున్నారు. తాము విడిపోయామని అంటున్నారు. అయితే తన పేరుతో డబ్బులు వసూలు చేసినందున ఆయన కూడా ఫిర్యాదు చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.


ఈ అంశంపై స్పందించేందుకు రమ్య రఘుపతి మీడియాకు అందుబాటులో లేరు. ఆమె ఎక్కడ ఉన్నారో పోలీసులు ( Police ) కూపీ లాగుతున్నారు. నరేష్‌తో విడిపోక ముందు నుంచే ఆమె అప్పులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికి ఐదుగురు మాత్రమే ఫిర్యాదు చేశారని పెద్ద ఎత్తున బాధితులు ఉంటారని భావిస్తున్నారు.