స్కైలాబ్(Skylab).. ఒకప్పుడు ఆ పేరు వింటే వణికిపోయిన మన పెద్దలు.. ఇప్పుడు దాని గురించి చెప్పమంటే తెగ నవ్వేస్తారు. ఆ రోజుల్లో భయంతో చేసిన పనులు గుర్తు తెచ్చుకుంటారు. అయితే, ఇప్పటివరకు స్కైలాబ్ ఘటన గురించి కథలుగా వినడమే గానీ.. సినిమాగా మాత్రం తెరకెక్కలేదు. ఈ నేపథ్యంలో నటి నిత్య మేనన్ నాటి ఘటనల ఆధారంతో ‘స్కైలాబ్’ (Skylab) టైటిల్‌తో సినిమాను నిర్మిస్తోంది. అప్పట్లో కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలతో వినోదాత్మకగా చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ శనివారం విడుదల కానుంది. ఇంతకీ ‘స్కైలాబ్’ అంటే ఏమిటీ? కరీంనగర్ జిల్లాలో ఏం జరిగింది. 


సైలాబ్ అంటే?: అది 1979, జులై 12వ తేదీ. ఇప్పుడు ఉన్నన్ని టీవీ చానెళ్లు అప్పట్లో లేవు. కేవలం రేడియోలో వచ్చే వార్తలనే ప్రజలు ఎక్కువగా వినేవారు. ఆ నోట ఈ నోట వచ్చే సమాచారాన్ని తెలుసుకుని అదే నిజమనుకుని నమ్మేవాళ్లు. ‘స్కైలాబ్’ విషయంలో కూడా అదే జరిగింది. ఇందులో నాసా (NASA) తప్పిదం కూడా ఉంది. స్కైలాబ్ (Skylab) అనేది అమెరికా ఏర్పాటుచేసిన మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం. దీన్ని మే 14, 1973న ప్రారంభించారు. దాని బరువు 2,310 కిలోలు. అప్పట్లో అది భూ వాతావరణం గురించి బోలెడంత డేటాను సేకరించి శాస్త్రవేత్తలకు సహకరించింది. సూర్యుడిపై కూడా లోతైన అధ్యయనాలను నిర్వహించింది. అయితే, కాలం చెల్లడంతో గతి తప్పి అంతరిక్షం నుంచి భూమిపై కూలేందుకు సిద్ధమైంది. కానీ, అది భూమిపై ఎక్కడ పడుతుందనే విషయాన్ని నాసా స్పష్టంగా తెలియజేయలేదు. అదే ప్రజల్లో భయాందోళనలకు కారణమైంది.


నిజామాబాద్ నుంచి ఏపీ తీర ప్రాంతాల వరకు..: స్కైలాబ్ తొలుత సముద్రంలో కూలిపోతుందని భావించారు. కానీ, ఆ తర్వాత అది భూమి వైపుకు దూసుకొస్తోందని, అది పడిన చోట భారీ విధ్వంసం తప్పదనే ప్రచారం జరిగింది. రేడియోల్లో ఎప్పుడూ చూసిన ఇవే వార్తలు. కొందరు తమకు తెలిసిన సమాచారానికి.. తెలియని అంచనాలు, భయాన్ని జోడించి ప్రచారం చేస్తూ ఆందోళన రెట్టింపు చేశారు. దీంతో ప్రపంచంలో చాలామంది అవే తమ ఆఖరి క్షణాలని భయపడ్డారు. తెలంగాణలోని నిజామాబాద్ నుంచి ఏపీలో తీర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ‘స్కైలాబ్’ కూలే ప్రమాదం ఉందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం ప్రజలను మరింత భయపెట్టింది.


కొందరు జల్సాలు, మరికొందరు ఏడుపులు..: కరీంనగర్ జిల్లా ప్రజలను ‘స్కైలాబ్’ మరింత భయపెట్టింది. ఎందుకంటే.. ‘స్కైలాబ్’ కచ్చితంగా అక్కడే పడనుందని, జనాలంతా చనిపోతారనే ప్రచారం జరిగింది. అంతే.. ప్రజల్లో భయం రెట్టింపైంది. డబ్బులు బాగా ఉన్నవాళ్లు ఇక అవే తమ ఆఖరి క్షణాలంటూ జల్సాగా గడిపేశారు. మందుబాబులైతే పీకలదాకా తాగేసి హ్యాపీగా గడిపేశారు. కొందరైతే ఊర్లో ఒకే చోటు కూర్చొని.. ఒకరినొకరు పట్టుకుని ఏడ్చేవారు. పేదలు మాత్రం కట్టుబట్టలతో కరీంనగర్ వదిలి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లిపోయారు. తాము బతక్కపోయినా.. పిల్లలైనా బతకాలంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నవారికి అప్పగించారు.


బావుల్లో తలదాచుకున్న ప్రజలు: ‘సైలాబ్’‌ను అక్కడి ప్రజలు వేరేగా అర్థం చేసుకున్నారు. నింగి ఊడి మీద పడుతుందని కొందరు.. ఆకాశం నుంచి ఏదో పెద్ద వస్తువు ఊరిపై పడుతుందని మరికొందరు ఇలా ఎవరి భయాన్ని వాళ్లు పెట్టుకున్నారు. కొందరు తమ ఆస్తులను, పశువులను తక్కువ ధరకు అమ్మేసి.. ఊరు వదిలివెళ్లియారు. ధనవంతులు, వ్యాపారులు.. తిరుపతి, కాశీలకు వెళ్లిపోయారు. ఎందుకంటే.. భూమిపై అవి మాత్రమే సురక్షిత ప్రదేశాలని వారి నమ్మకం. అయితే, ఊర్లో ఉన్నవారు మాత్రం ఎక్కడికి వెళ్లలేక నీళ్లులేని బావుల్లో తలదాచుకున్నారు. కొందరు దేవాలయాల్లో గడపగా, ఇంకొందరు తమ వద్ద నగలు, నగదును మూటలు కట్టి బావుల్లో పడేశారు.


‘స్కైలాబ్’ ఎక్కడ కూలింది?: స్కైలాబ్ 1979, జులై 11న భూమి వైపు దూసుకురావడం ప్రారంభమైంది. చివరి అది జులై 12న భూవాతావరణంలోకి రాగానే కాలిపోయింది. కొన్ని ముక్కలు ఆస్ట్రేలియాలో, హిందూ మహాసముద్రంలో చెల్లాచెదురుగా పడ్డాయి. లక్కీగా ఆ రోజు ఎవరికీ ఏమీ కాలేదు. ఎక్కడా ఆస్తినష్టం కూడా జరగలేదు. ఇక ‘స్కైలాబ్’తో ముప్పులేదని తెలిసిన తర్వాత అంతా ‘హమ్మయ్య’ అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్లో ప్రజలు చేసిన తలచుకుంటే నవ్వురావచ్చు. కానీ, ఆ పరిస్థితి ఇప్పుడు ఉన్నా ప్రజలు అలాగే స్పందించేవారు. కాలం మారినా.. భయంలో మాత్రం మార్పు ఉండదు. 2012లో భూమి అంతం అవుతుందని తెలిసినప్పుడు కూడా చాలా మంది వింతగా ప్రవర్తించారు. కానీ, అది జరగలేదు. ప్రళయమనేది చెప్పి రాదు.. ఒక వేళ వచ్చినా దాన్ని ఎవరూ ఆపలేరు. చెప్పాలంటే.. ఇప్పుడు ప్రళయం వస్తుందని చెబితే ప్రపంచం వణికిపోతుందేమో, కానీ.. కరీంనగర్ ప్రజలు మాత్రం భయపడరు. 


1979 నాటి ఘటనల ఆధారంగా ‘స్కైలాబ్’ సినిమా ట్రైలర్ ప్రోమో: 



Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి