కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ తాజాగా ఓ థియేటర్లో బీభత్సం సృష్టించారు. గురువారం విడుదలైన 'లియో' ట్రైలర్ ని ఓ థియేటర్లో ప్రదర్శించగా ఆ ట్రైలర్ ని చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ థియేటర్ సీట్లను చింపి, కుర్చీలను విసురుతూ నానా రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లియో'(Leo). లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. అక్టోబర్ 5 గురువారం సాయంత్రం 'లియో' ట్రైలర్ రిలీజ్ అయింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ట్రైలర్ ఐ ఫీస్ట్ ఇచ్చింది. ట్రైలర్ మొత్తం యాక్షన్స్ సన్నివేశాలతో సాగడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇదిలా ఉంటే 'లియో' ట్రైలర్ ని చెన్నై లోని రోహిణి థియేటర్లో ప్రదర్శించారు. దీంతో ట్రైలర్ చూసేందుకు వందలాది మంది అభిమానులు థియేటర్ కి చేరుకున్నారు. ట్రైలర్ చూసే ఉత్సాహంతో అభిమానులు థియేటర్స్ లో సీట్లు చింపి చెల్లాచెదులు చేశారు. కుర్చీలను విసురుతూ నానా హంగామా చేశారు.






ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన మరో వీడియోని ఓ నెటిజన్ తన సోషల్ మీడియాలో పంచుకుంటూ..' ఫ్యాన్స్ ఇది కావాలని చేసిన పని కాదని, థియేటర్ యాజమాన్యం చేసిన తప్పు వల్లే ఇలా జరిగిందని' రాసుకొచ్చాడు . ఏదేమైనా థియేటర్లో విజయ్ ఫ్యాన్స్ సృష్టించిన బీభత్సం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ టైమ్స్ లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు అగ్ర హీరోల ఫ్యాన్స్ ఇలాంటి పనులు చేయడంతో థియేటర్ యాజమాన్యం అప్రమత్తమై ఇలాంటి స్టంట్స్ జరిగే సమయంలో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు.






ఇక 'లియో' ట్రైలర్ విషయానికొస్తే.. " సీరియల్ కిల్లర్ నడి రోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది చనిపోయారు.. వాడు అందరినీ కలుస్తున్నాడు’’ అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత లోకేష్ ట్రైలర్ మొత్తాన్ని యాక్షన్ సీన్స్ తోనే నింపేశాడు. దీన్నిబట్టి ఇది లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఓవైపు యాక్షన్ ని హైలెట్ చేస్తూనే మరోవైపు సినిమా కథేంటి అనే దాన్ని కూడా ట్రైలర్ లో చెప్పే ప్రయత్నం ఆకట్టుకుంది. ఇందులో విజయ్ ని లియోదాస్, పార్థి అనే రెండు పాత్రల్లో చూపించారు.


అయితే ఇద్దరూ ఒకే పోలికలతో ఉండటంతో ఒకరు అనుకుని మరొకరిని శత్రువులు వెంబడిస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు. రౌడీల నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి తప్పించుకొని తిరుగుతున్న పార్థి, చివరికి వాళ్లపైనే తిరగబడతాడు. సంజయ్ దత్, అర్జున్, డైరెక్టర్ మిస్కిన్ లు విలన్స్ గా.. గౌతమ్ మీనన్ పోలీసాఫీసర్ గా కనిపించారు. విజయ్ భార్యగా త్రిష కనిపించింది. మొత్తంగా ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లారు. అక్టోబర్ 19న దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read ; ఇండ్రస్ట్రీ లో కొత్త స్కామ్ - సంచలన నిజాలు బయటపెట్టిన బ్రహ్మాజీ!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial