Sitaram Yechury: విశాఖ  ఉక్కు అప్పులను నష్టాలుగా చూపించి కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం అన్యాయం అంటూ సీపీఐ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. వ్యవస్థను మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెడుతోంది అని ఆయన విమర్శలు గుప్పించారు. రైతు ఉద్యమం తరహాలో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాలపై వెనక్కి తగ్గడం ఖాయమని, స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే మోదీని అధికారానికి దూరం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉంటే కేంద్రం మాత్రం తప్పుడు ప్రచారాలు చేసుకుంటోందని మండిపడ్డారు. 


ప్రచారానికి ఉన్న డబ్బు, రుణమాఫీకి లేదా?
ప్రచారాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న మోదీ.. రైతుల రుణమాఫీకి మాత్రం ముందుకు రారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత తొమ్మిదేళ్లలో రూ.లక్షల కోట్లను పెట్టుబడిదారులకు పీఎం మోదీ రుణమాఫీ చేశారని, ఉక్కు కర్మాగారానికి వున్న తక్కువ అప్పులను రుణమాఫీ చేయడం ప్రధానికి ఓ లెక్కా అని ప్రశ్నించారు. ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేస్తామని కేంద్రం ప్రకటించేంత వరకు ఉక్కు కార్మికులకు అండగా ఉంటామన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో తనకున్న అనుభవాలను వివరించారు. 


విశాఖ ఉక్కుకు I.N.D.I.A మద్దతు
2024లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కాపాడుకోవడానికి యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీతారం ఏచూరి అన్నారు. ఇండియా కూటమి తరఫున విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యతను మార్కిస్ట్ పార్టీ తీసుకుంటుందని పేర్కొన్నారు. 28 భాగస్వామ్య పార్టీల మద్దతు కూడ గట్టి విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం కోసం కృషి చేస్తామన్నారు. రైతాంగం ఉద్యమం తరహాలో ఉక్కుపోరాటం నిరంతరాయంగా, ధృఢంగా కొనసాగాలని పిలుపు నిచ్చారు. ఇండియా కూటమి తరఫున విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తోందని, విశాఖ ఉక్కు-మన హక్కు నినాదంతో పోరాటం కొనసాగించాలని ఆయన కోరారు. 


వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మాలనేది బీజేపీ విధానమని, ప్లాంట్‌ను అమ్మడాన్ని ఉపసంహరించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. గంగవరం పోర్టును ప్రైవేటీకరణ చేశారని, మోదీ సర్కారు వచ్చినప్పటి నుంచి ప్రైవేటీకరణలను చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరామని, బీజేపీ ప్రభుత్వం వేస్తే.. 5 ఏళ్లు కాదు, 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాడు వెంకయ్య నాయుడు అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అది ఏమైందో అందరికీ తెలుసన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు రుణాలు మాఫీ చేశారని, స్టీల్ ప్లాంట్‌కి ఎందుకు అలా రుణాలను మాఫీ చేయలేదని ప్రశ్నించారు? స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టించవచ్చని, కానీ బీజేపీ అలా చేయడం లేదన్నారు.


పవన్‌కే క్లారిటీ లేదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలపై అవగాహన లేనట్లుందని సీతారాం అభిప్రాయపడ్డారు. పవన్ వైఖరిలో స్పష్టత లేదన్నారు. ఒకసారి ఎన్డీఏకు దూరం అంటారని, మరోసారి మోదీతో మాట్లాడాలని అంటారని అన్నారు. పనన్ నిర్ణయంపై ఆయనకే క్లారిటీ లేదని ఏచూరి అన్నారు. ఏపీలో సంపూర్ణ విజయం అనే స్టేట్మెంట్ లు ఎవరు ఇచ్చినా అది ఎన్నికల వ్యూహంలో భాగమేనని చెప్పారు. అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. 


చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన  ఏచూరి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను మార్కిస్టు పార్టీ ఖండిస్తోందని సీతారాం ఏచూరి అన్నారు. మత సామరస్యం, రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షించాలంటే I.N.D.I.A. కూటమి అధికారంలోకి రావాలన్నారు. 36 పార్టీల NDA ఒకవైపు.. 28పార్టీల I.N.D.I.A. మరోవైపు పోరాటానికి సిద్ధం అవుతున్నాయని ఆయన వ్యాఖ్యనించారు. దేశం అభివృద్ధి చెందాలన్నా.. ప్రభుత్వ రంగ సంస్థలు మనుగడ సాగించాలన్నా మోదీని అధికారానికి దూరం చేయాలని సీతారం ఏచూరి పిలుపునిచ్చారు.