Nagarjuna Sagar: ఇవాళ్టి నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నీటిని శుక్రవారం నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న వరి పొలాలకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు కురవలేదు. వర్షాలు కురుస్తాయన్న నమ్మకంతో వేసిన వరి పంట దెబ్బతినే ప్రమాదం ఏర్పడటంతో ఆ ప్రాంత రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ మేరకు అన్నదాతలు, శాసనసభ్యులు, మంత్రులు ముఖ్యమంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 


వరి పంట దెబ్బతినకుండా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ వాటా కింద కృష్ణా జలాల్లో మన వాటా నీటిని శుక్రవారం నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న వరి పొలాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. మరో 20 రోజుల తర్వాత మరో తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.


ఈ ఏడాది సరైన వర్షాలు లేక నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఆశించిన మేరకు నీరు రాలేదు. దీంతో ఉన్న నీటినే ఒడుపుగా, పొదుపుగా వాడుకొని వరి పంటను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నీళ్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పర్యవేక్షిస్తూ, రైతుల చివరి పొలాలకు, చివరి ఆయకట్టు దాకా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. 


మరోవైపు ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సీజన్ అనుకూలిస్తుందని కొండంత ఆశతో సాగర్ ఆయకట్టు రైతులు పంటలు సాగు చేయగా.. వర్షాలు లేక కన్నీళ్లే మిగిలాయి. ఆశించిన మేర వానలు లేకపోవడం, ఎగువ ప్రాంతాల నుంచి కూడా ప్రాజెక్టులకు నీరు రాకపోవడంతో.. నీటి విడుదల లేక పంటల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సాగు నీరు అందక పొట్టదశలో ఉన్న వరి పంటలు ఎండిపోతూ.. రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి.


సీజన్ ఆరంభంలో కొంత మేర వానలు ఊరించడంతో ఈ సీజన్ కలిసి వస్తుందన్న నమ్మకంతో రైతులు పంటలు సాగు చేశారు. కృష్ణా పరివాహకంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే సాగు నీటికి ఇబ్బందులు ఉండవని భావించారు. వీటికి తోడు బోర్లు, బావులు ఉండటంతో పంటలు ఇబ్బంది ఉండదని అనుకున్నారు. కానీ, రైతుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఆయకట్టు భూముల్లో ప్రవహించాల్సిన కృష్ణమ్మ.. సందడి కానరాలేదు. దీంతో పంటలు వెలవెలాబోతున్నాయి. కృష్ణమ్మ కరుణించకపోతుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టిన పంటలు సాగు నీరు అందక తడారి పోతుంటే.. ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదలతో పంట సాగు రైతులు కాస్త ఉపశమనం కల్పించినట్లు అయింది.