తెలంగాణ రాష్ట్రంలో బడి విద్యార్థుల కోసం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10 తరగతుల విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభం చేయనున్నారు. ఈ మేర‌కు పొద్దున్నే పిల్లలకు వడ్డించే బ్రేక్ ఫాస్ట్ మెనూను తయారు చేసి విడుదల చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల జ‌డ్పీహెచ్ఎస్‌లో ఈ ప‌థ‌కాన్ని రేపు శుక్ర‌వారం (అక్టోబరు 6) ఉద‌యం 8:45 గంట‌ల‌కు ప్రారంభించ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠ‌శాల‌ల్లో 23 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఈ ప‌థ‌కం ద్వారా లబ్ధి పొంద‌నున్నారు. పాఠ‌శాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందివ్వ‌నున్నారు. ఈ పథకం వల్ల పిల్లల్లో పోషకాహార లోపం నివారించడంతో పాటుగా హాజరు శాతం పెంచడం ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.


బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే
సోమ‌వారం - ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ ర‌వ్వ ఉప్మా, చ‌ట్నీ
మంగ‌ళ‌వారం - పూరి, ఆలు కుర్మ లేదా ట‌మాటా బాత్ విత్ ర‌వ్వ‌, చ‌ట్నీ
బుధ‌వారం - ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చ‌ట్నీ
గురువారం - మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగ‌ల్, సాంబార్
శుక్ర‌వారం - ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చ‌ట్నీ లేదా గోధుమ ర‌వ్వ కిచిడీ, చ‌ట్నీ
శ‌నివారం - పొంగ‌ల్/సాంబార్ లేదా వెజిట‌బుల్ పులావ్, రైతా/ఆలు కుర్మా