Newborn Alive in Assam:
గువాహటిలో వింత ఘటన..
అసోంలోని గువాహటిలో వింత ఘటన జరిగింది. ఓ పసికందు చనిపోయిందని హాస్పిటల్ వాళ్లు డిక్లేర్ చేశారు. అంత్యక్రియలు చేసే సమయంలో ఉన్నట్టుండి ఆ శిశువు కదలడం చూసి అంతా షాక్ అయ్యారు. చనిపోయిందనుకున్న చిన్నారి మళ్లీ బతికింది. సిల్చర్‌లో జరిగిందీ ఘటన. అక్టోబర్ 3వ తేదీన రాత్రి డెలివరీ అయింది. మరుసటి రోజు ఉదయం ఆ శిశువు చనిపోయిందని వైద్యులు నిర్ధరించారు. కానీ తీరా పూడ్చే పెట్టే ముందు కదిలింది. అంత్యక్రియలు చేసేందుకు ఆ చిన్నారి పూర్తిగా చుట్టేశారు. ఉన్నట్టుండి లోపల నుంచి ఏడుపు వినిపించింది. ఇది గమనించి వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నారు. ఈ షాక్‌లో నుంచి తేరుకున్న కుటుంబ సభ్యులు శిశువు చనిపోయిందని చెప్పిన హాస్పిటల్‌పై మండి పడ్డారు. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం...మూడు రోజుల క్రితం ఆర్నెల్ల గర్భవతి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కారణంగా చికిత్స తీసుకునేందుకు హాస్పిటల్‌కి వెళ్లింది. అయితే..అక్కడ ట్రీట్‌మెంట్ సరిగ్గా లేదని అక్కడి నుంచి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్టోబర్ 3వ తేదీన రాత్రి ఆమెకి డెలివరీ చేశారు. పసికందు ఏ కదలికా లేకుండా ఉందని, అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. మరుసటి రోజు శిశువు చనిపోయినట్టు నిర్ధరించి అప్పగించారు. డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. కానీ అంతలోనే ఆ చిన్నారి బతికింది. ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకూ ఫిర్యాదు చేశారు.
"మహిళ మా హాస్పిటల్‌కి వచ్చినప్పుడు పరిస్థితి చాలా విషమంగా ఉంది. బ్లీడింగ్ అవుతోంది. ఆ సమయంలోనే బిడ్డను ప్రసవించింది. ఆ చిన్నారి కేవలం 500 గ్రాముల బరువుంది. నార్మల్ డెలివరీయే అయింది. కానీ చిన్నారి గుండె కొట్టుకోలేదు. చాలా సేపటి వరకూ ఏ కదలికా కనిపించలేదు. అందుకే అబ్జర్వేషన్‌లో ఉంచాం. అయినా ఏ మార్పు కనిపించలేదు. అందుకే...క్లినికల్ డెడ్‌గా ప్రకటించాం"
- ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుడు
మధ్యప్రదేశ్‌లోనూ..
మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఓ ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తికి కరోనా సోకిందని కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే పరిస్థితులు చేయి దాటిపోయాయి. వైద్యులు కూడా చేతులెత్తేశారు. చనిపోయాడని వైద్యులు డిక్లేర్ కూడా చేశారు. కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. కొన్ని రోజులు బాధపడ్డారు. ఆ తరవాత సాధారణ జీవితాలు గడుపుతూ వస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వాళ్లకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఉదయం ఆరు గంటలకు ఎవరో తలుపు కొట్టిన చప్పుడైంది. ఇంత పొద్దున్నే ఎవరొచ్చి ఉంటారు అనుకుంటూ ఇంట్లో వాళ్లు తలుపు తీశారు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అలాగే స్టన్ అయిపోయారు. రెండేళ్ల క్రితం కరోనా చనిపోయాడనుకున్న ఆ వ్యక్తే ఇప్పుడు ఎదురుగా వచ్చి నిలబడితే నోట మాట వస్తుందా..? అవును. చనిపోయాడనుకున్న వ్యక్తి రెండేళ్ల తరవాత ఇంటికి రావడాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ కుటుంబ సభ్యులు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిందీ వింత ఘటన.
Also Read: మోదీ చాలా తెలివైన వ్యక్తి, ఆయన వల్లే భారత్ దూసుకుపోతోంది - పుతిన్ ప్రశంసలు