జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గొప్పా? చిరంజీవా? అనే చర్చ జరుగుతోంది. నీరజ్ చోప్రా కంటే ముందే చిరంజీవి వరల్డ్ రికార్డు సాధించారని, గోల్డ్ మెడల్ తప్పకుండా చిరంజీవికే దక్కాలని అంటున్నారు. ఇంతకీ.. మన చిరంజీవికి జావెలిన్ త్రోకు సంబంధం ఏమిటనేగా మీ సందేహం? అయితే, మీరు తప్పకుండా ఈ వైరల్ వీడియోను చూడాల్సిందే.
మెగాస్టార్ చిరంజీవి, సాక్షి శివానంద్ నటించిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలోని ఓ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండవ్వుతోంది. ఆ సినిమాలో చిరు జావెలిన్(బల్లెం)ను విసురుతున్న దృశ్యంపైనే ఇప్పుడు చర్చంతా. ఈ సీన్‌లో చిరు విసిరే బల్లెం చాలా దూరం ఎగురుతుంది. చివరికి అది జడ్జిల టేబుల్‌కు వెళ్లి గుచ్చుకుంటుంది.
గబ్బర్ సింగ్ అనే ట్విట్టర్ యూజర్.. ‘జావ్వెలిన్‌లో తొలి బంగారు పతకం’ అంటూ ఈ వీడియోను ట్వీట్ చేశాడు. దీంతో నీరజ్ చోప్రా కంటే ముందు చిరు గోల్డ్ మెడల్ సాధించేంత ప్రతిభ చూపారని నెటిజనులు అంటున్నారు. చిరంజీవి స్ఫూర్తితోనే నీరజ్ చోప్రా భారత్‌కు పతకం తీసుకొచ్చాడని కామెంట్లు చేస్తున్నారు. చిరు విసిరితే బల్లెం స్టేడియంను దాటాల్సిందేనని పలువురు అభిమానులు అంటున్నారు.
వీడియో:
నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత.. మన తెలుగు హీరోల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే ట్రెండయ్యాయి. ‘లెజండ్’ సినిమాలో బాలకృష్ణ బల్లెం విసిరే వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. అలాగే ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాలోని ఓ చిత్రం కూడా ఎక్కువగా షేరవుతోంది. ప్రముఖ వాణిజ్యవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఆ నీరజ్ చోప్రా పక్కనే ప్రభాస్ బల్లెం పట్టుకున్న చిత్రాన్ని పెట్టి ట్వీట్ చేశారు. ‘‘మీ సైన్యంలో మేమూ ఉన్నాం ‘బాహుబలి’ #NeerajChopra’’ అని పేర్కొన్నారు. దీంతో నీరజ్ అభిమానులు ఆ పోస్టు చూసి ముగ్దులవుతున్నారు. అంతేకాదు.. చోప్రాకు XUV 700ను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
నీరజ్ చోప్రాపై బయోపిక్?:
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి యావత్తు భారత ప్రజల అభిమానాన్ని చూరగొన్న నీరజ్ చోప్రాకు ఎనలేని ఆధరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కన్ను చోప్రాపై పడింది. అతడి బయోపిక్‌ను ప్రజలకు గిఫ్టుగా ఇవ్వాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు. అప్పుడే చోప్రా పాత్రకు ఏ హీరో సరిపోతాడనే విషయం మీద కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా చోప్రా.. తన పాత్రలో ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ లేదా రణదీప్ హుడా నటిస్తే బాగుంటుందని చెప్పడం విశేషం.
Also Read: నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్ర.. భారీ నజరానా, ‘బాహుబలి’తో పోల్చుతూ..