కరోనా వ్యాక్సిన్.. ప్రస్తుతం దేశ ప్రజలను వైరస్ బారి నుంచి కాపాడే ఔషధం. అయితే ఈ వ్యాక్సిన్ లు పక్కదారి పడుతున్నాయా? ఇంత పకడ్బందీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నప్పటికీ లోపాలు ఉన్నాయా? అవును.. మహారాష్ట్ర ఔరంగాబాద్ లో వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్ రెచ్చిపోతుంది. ఇందులో ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉందని 'ఏబీపీ' స్టింగ్ ఆపరేషన్ లో తేలింది.



 


బ్లాక్ మార్కెట్..


మహారాష్ట్రలో ప్రస్తుతం వైరస్ విజృంభిస్తోంది. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రతిరోజూ ఉదయం వందల సంఖ్యలో జనం పడిగాపులు కాస్తున్నారు. అయితే అలాంటి వ్యాక్సిన్ లు ఇప్పుడు బ్లాక్ మార్కెట్ చేతిలో పడటం ఆందోళన కలిగిస్తోంది. ఔరంగాబాద్ లో నడుస్తోన్న ఈ బ్లాక్ మార్కెట్ ను ఏబీపీ వెలుగులోకి తీసుకువచ్చింది. 


గణేశ్ దురోలే అనే వ్యక్తి ప్రతిరోజూ వ్యాక్సిన్ కేంద్రం నుంచి 30 నుంచి 40 టీకాలను దొంగలించి రహస్యంగా కొంతమందికి అమ్ముతున్నాడు. ఇలా దొంగిలించిన వ్యాక్సిన్ లను రూ.300కే ప్రజలకు వేస్తున్నారు. ఇది కేవలం ఓ ఉదాహరణ. అయితే ఇది మహారాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్లు సమాచారం. ఏబీపీ వల్ల ప్రస్తుతం ఈ బ్లాక్ మార్కెట్ బయటకు వచ్చింది.


ఎవరీ గణేశ్..


గణేశ్ దురోలే.. ఔరంగాబాద్ వాలుజ్ ప్రాంతంలోని సజాపుర్ లో ఓ ఆరోగ్య కార్యకర్త. అక్కడి వ్యాక్సిన్ కేంద్రం నుంచి గణేశ్ టీకాలు దొంగలిస్తున్నాడు. ఏబీపీ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన గణేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.






 

వ్యాక్సిన్ ల కోసం అంత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు రావడం ఆందోళన కలిగిస్తోంది. గణేశ్ లాంటి కేవలం చిన్నచేపలే అని తెలుస్తోంది. వీళ్ల వెనుక పెద్ద చేపలే ఉన్నాయి. ఈ బ్లాక్ రాకెట్ ఎక్కడ మొదలైంది? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలగానే మిగిలిపోయాయి. అయితే సామాజిక కార్యకర్తలు, విపక్షాలు మాత్రం ఈ బ్లాక్ మార్కెట్ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిందని ఆరోపిస్తున్నాయి. మరి ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

 

ఈ బ్లాక్ దందా ఇప్పటిది కాదు.. కరోనా టైంలోనూ రెచ్చిపోయారీ బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు. రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్ ఇలా ఏది ప్రజలకు అత్యవసరం అనుకుంటే దాన్ని బ్లాక్ చేసి పైసలు దండుకోవడం వీళ్లకు అలవాటు పడింది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి గ్యాంగ్‌లు చాలా వాటిని పోలీసులు పట్టుకున్నారు. దురదృష్టకరం ఏంటంటే.... ఆసుపత్రుల్లో పని చేస్తున్నవాళ్లో... వైద్య సిబ్బందో... ఈ దందాకు తెర తీస్తున్నారు. తీగ లాగితే డొంక కదిలేది అక్కడే ఉండటం చాలా బాధ కలిగించే అంశం.