భారత జావెలిన్‌ త్రో ప్లేయర్‌ నీరజ్‌ చోప్రా వందేళ్ల కలను సాకారం చేశాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించి ఔరా అనిపించాడు. ఈ నేపథ్యంలో నీరజ్ యావత్ భారత దేశం సలాం చేస్తోంది. ప్రభుత్వంతోపాటు వివిధ సంస్థలు అభినందనలు కురిపిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నాయి. 


ఈ జాబితాలో తాజాగా ప్రముఖ వాణిజ్య దిగ్గజం.. ఆనంద్ మహీంద్ర కూడా చేరారు. ట్విట్టర్ వేదికగా నీరజ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఓ భారీ బహుమతిని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు, ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ బల్లెం విసురుతున్న ఫొటోను ఒక పక్క, నీరజ్ జావెలిన్ త్రో చేస్తున్న చిత్రం మరోవైపు పోస్ట్ చేస్తూ.. ‘‘మీ సైన్యంలో మేమూ ఉన్నాం ‘బాహుబలి’  #NeerajChopra’’ అని ట్వీట్ చేశారు. దీంతో నీరజ్ అభిమానులు ఆ పోస్టు చూసి ముగ్దులవుతున్నారు. 


ఆనంద్ మహీంద్ర ఆ ఒక్క ట్వీట్‌తో ఆగలేదు. రితేశ్ జైన్ అనే వ్యక్తి చేసిన ట్వీట్‌కు మహీంద్ర సమాధానం ఇస్తూ.. ‘‘మన గోల్డెన్ అథ్లెట్‌కు నీరజ్ చోప్రాకు నా నుంచి ఒక XUV 700ను బహుమతిగా ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అని తెలిపారు. దాన్ని వెంటనే సిద్ధం చేయాలంటూ మహీంద్ర ఇద్దరు ఉద్యోగులను కూడా ఆ ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. అంటే.. మహీంద్ర తరఫు నుంచి త్వరలోనే నీరజ్ కొత్త XUV 700 కారును కానుకగా అందుకోనున్నాడన్నమాట. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. ఇంకా మార్కెట్లోకి రాక ముందే నీరజ్ ఆ కారును బహుమతిగా పొందనున్నాడు. ఇదివరకు కూడా మహీంద్ర పలువురు క్రీడాకారులకు తన సంస్థ నుంచి కార్లను అందించి గౌరవించారు. రియో 2016 ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రతిభ చూపిన పీవీ సింధూకు, సాక్షి మాలిక్‌లకు ‘థార్’ కార్లను అందించారు.  


ఆనంద్ మహీంద్ర ట్వీట్స్:



టోక్యో ఒలింపిక్స్ 2020లో భారతదేశానికి నీరజ్ స్వర్ణ పతకం అందించాడు. జావెలిన్ త్రో విభాగంలో మహాహులను వెనక్కి నెట్టిన నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని అందించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఒలింపిక్ గేమ్స్‌లో స్వర్ణాన్ని సాధించిన భారత జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడచూసిన నీరజ్ చోప్రా సాధించిన ఘనత గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నీరజ్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య గత 24 గంటల్లో భారీగా పెరిగింది. ఈ క్రమంలో కేవలం గడిచిన 24 గంటల్లో 10 లక్షల మంది కొత్త ఫాలోయర్లను నీరజ్ చోప్రా సొంతం చేసుకున్నాడు.