దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా విమానాశ్రయంలో బాంబ్ బ్లాస్ చేయనున్నట్లు పోలీసులకు మెయిల్ రావడం కలకలం రేపింది.


ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తామని అల్ ఖైదా సర్గానా ప్లాన్ చేసినట్లు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ మేరకు  ఐజీఐ పోలీస్ స్టేషన్ నుంచి ఎయిర్ లైన్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఏఓసీసీ)కు శనివారం సమాచారం అందింది. కరణ్ బీర్ సూరి  అలియాస్ మహ్మద్ జలాల్, కరణ్ బీర్ భార్య షైలీ షర్దా అలియాస్ హసీనా సింగపూర్ నుంచి ఆదివారం భారత్ కు వస్తున్న నేపథ్యంలో విమానాశ్రయంలో 3 రోజుల్లో బాంబు పెడుతున్నట్లు ఆ మెయిల్ లో పేర్కొన్నారు. 


        ఐజీఐ విమానాశ్రయం


అయితే  వెంటనే స్పందించిన భద్రతా దళాలు.. అది ఫేక్ సమాచారమని తేల్చారు. అయినప్పటికీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా దళాలు హై అలర్ట్ లో ఉన్నాయి. 


విమానాశ్రయం వద్ద ఉన్న అన్ని టర్మినల్స్ లోనూ బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అన్ని వాహనాలను చెక్ చేశారు. ప్రస్తుతం ఆ మెయిల్ ఎవరు చేశారు అనే దానిపై విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే ముంబయి పోలీసు కంట్రోల్ రూమ్ కు బెదిరింపు కాల్ వచ్చిన తర్వాత రోజే ఈ మెయిల్ రావడం ఆందోళన కలిగిస్తోంది.


అమితాబ్ ఇంటిని పేల్చేస్తామంటూ..


ముంబయిలో ఉన్న అమితాబ్ బచ్చన్ ఇంటిని పేల్చేస్తామంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి శుక్రవారం రాత్రి వార్నింగ్ ఇచ్చారు. అమితాబ్ ఇంటితో పాటు మరో మూడు రైల్వే స్టేషన్స్‌లో కూడా బాంబులు ఉన్నాయంటూ పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు.


బాంబ్ స్వాడ్‌లతో ప్రతి చోటును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అమితాబ్ బచ్చన్ ఇంటిని కూడా అణువణువు పరిశీలించారు. కొన్ని గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. అయితే పోలీసులకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదు. ఇది ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు పోలీసులు.


ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఆగంతకుడు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, బైకుల్లా, దాదర్ రైల్వే స్టేషన్‌లతో పాటు.. జుహులోని నటుడు అమితాబ్ బంగ్లా దగ్గర బాంబులు పెట్టామని తెలిపారు. బాంబులు లేవని తెలిసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలోనూ ఇలాంటి ఫేక్ కాల్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. అక్కడ విజయ్, అజిత్, రజినీకాంత్ ఇంటి దగ్గర బాంబులు పెట్టామంటూ ఇటీవల ఫేక్ కాల్స్ వచ్చాయి.