యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen), నివేతా పేతురాజ్(Nivetha Pethuraj) జంటగా నటించిన చిత్రం 'పాగల్'(Paagal). నరేష్ కొప్పిలి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. ఈ క్రమంలో తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో విశ్వక్ సేన్ లవర్ బాయ్ అవతారంలో దర్శనమిచ్చారు. 

 

''నా పేరు ప్రేమ్‌. నేను 1600 మంది అమ్మాయిల్ని ప్రేమించాను'' అంటూ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. కనిపించిన ప్రతీ అమ్మాయికి ఐలవ్యూ చెప్పే విశ్వక్ సేన్ కు నివేతా ఎదురవుతుంది. అప్పటినుండి విశ్వక్ జీవితం మారిపోతుంది.  ''చూడు.. ఇప్పటి వరకు ఒకెత్తు.. ఇప్పటి నుంచి ఒకెత్తు. నేను చాలామంది అమ్మాయిలకు ఐ లవ్‌ యు చెప్పాను. కానీ, నిన్ను మాత్రమే లవ్‌ చేస్తున్నా'' అంటూ తన ప్రేమను ఎమోషనల్ గా ఎక్స్ ప్రెస్ చేసే సీన్ హైలైట్ గా నిలిచింది.

 

విజువల్స్ అన్నీ కూడా చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. ట్రైలర్ లో కనిపించిన ప్రతీ ఒక్కరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. రాహుల్ రామకృష్ణ, మహేష్ ఆచంట కామెడీ డైలాగ్స్ మెప్పించాయి. దిల్ రాజు సమర్పిస్తోన్న ఈ సినిమాను బెక్కం వేణుగోపాల్ నిర్మించారు. రతన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.  సిమ్రన్‌ చౌదరి, మేఘాలేఖ, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

 

నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. కానీ కరోనా కారణంగా సినిమాను పక్కన పెట్టారు. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటుండడంతో విశ్వక్ సేన్ తన సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు.