మెగాస్టార్ చిరంజీవి మొదటి సారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై బహిరంగంగా స్పందించారు. తక్షణం ఎన్నికలు పెట్టాలని కోరుతూ "మా" క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు.   ప్రస్తుత కమిటీ పదవి కాలం ముగిసిందని.. దీని వల్ల సభ్యుల కోసం చేపట్టాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని లేఖలో చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఇబ్బంది "మా" సభ్యులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలపై ఇప్పటికే అనేక మంది సభ్యులు బహిరంగంగా అనేక ప్రకటనలు చేస్తున్నారని.. దీని వల్ల చెడ్డపేరు వస్తోందని చిరంజీవి లేఖలో అన్నారు. 


 వెంటనే జరపకపోతే వివాదాలు మరింత ముదిరే అవకాశముందని..అందుకే వెంటనే ఎన్నికలు జరిపేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజును కోరారు. " పరిశ్రమలో పెద్దవారు. మీకు మొదటి నుంచి జరుగుతున్న విషయాలన్నీ తెలుసు. సంస్థ ప్రతిష్ఠను మసకబారుస్తున్న వారెవ్వరిని మీరు ఉపేక్షించవద్దు. వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోండి" అని కూడా చిరంజీవి లేఖలో కృష్ణంరాజుకు సిఫార్సు చేశారు. వివాదాలు అన్నీ ముగిసిపోయి ఓ కుటుంబంలా కలిసి పనిచేసే రోజులు త్వరలోనే వస్తాయనే ఆశాభావాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు. 


కొద్ది రోజులుగా "మా" ఎన్నికల అంశం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్‌ను ప్రకటించిన తర్వాత.. ఎన్నికలు ఎప్పుడు అనిపదే పదే అడుగుతూ వస్తున్నారు. ప్రస్తుత కార్యవర్గంలో పదిహేను మంది తక్షణం ఎన్నికలు పెట్టారని కృష్ణంరాజుకు రెండుసార్లు లేఖలు రాశారు. దీంతో వచ్చే నెల 12వ తేదీన ఎన్నికలు పెట్టాలనుకుంటున్నారన్న ఓ ప్రచారం బయటకు వచ్చింది. కానీ అసలు ఎన్నికలే పెట్టే ఉద్దేశంలో లేరని.. కొంత మంది అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో హేమ.. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ఆడియోవిడుదల చేశారు. ఇది దుమారం రేపింది. 


రాను రాను "మా" ఎన్నికల అంశం.. సినిమా స్టోరీలాగా మారిపోతూండటంతో..  మరింత రచ్చ కాకుండా ఉండటానికి చిరంజీవి రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. అయితే చిరంజీవి తల్చుకుంటే.. ఏకగ్రీవం అవుతుందని టాలీవుడ్‌లోని కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ ఎన్నికల కోసమే చిరంజీవి లేఖ రాశారు. దీంతో ఎన్నికలు ఖాయమని చెప్పుకోవచ్చంటున్నారు. మొత్తం మా ఎన్నికల బరిలో ఐదుగురు అధ్యక్ష అభ్యర్థులు ఉన్నారు. ప్రకాష్ రాజ్ పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనకు చిరంజీవి మద్దతిస్తున్నారన్న ప్రచారం ఉంది. మంచు విష్ణు కూడా రంగంలోకి దిగుతున్నారు. పెద్దలంతా మద్దతిస్తే ఏకగ్రీవానికి సహకరిస్తానంటున్నారు. కానీ వివాదం ముదిరి పాకాన పడుతోంది. చిరంజీవి స్పందనతో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.