టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి యావత్తు భారతదేశంలో ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్‌గా మారాడు నీరజ్ చోప్రా(Neeraj Chopra). ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణాన్ని(Gold Medal) అందించి,  దేశ కీర్తి ప్రతిష్ఠలను పతాక స్థాయికి చేర్చిన నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. బాలీవుడ్ హీరోలను తలదన్నేలా ఉన్నాడు నీరజ్ చోప్రా. దీంతో ప్రస్తుతం అతడి బయోపిక్ పై చర్చలు మొదలయ్యాయి. నీరజ్ బయోపిక్ గురించి చర్చ రావడం ఇదే తొలిసారి కాదు. 2018లో జరిగిన ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో నీరజ్ బంగారు పతకాలను సాధించాడు. ఆ సమయంలో మొదటిసారి నీరజ్ బయోపిక్ ప్రస్తావన వచ్చింది. దీనిపై అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో నీరజ్.. తన జీవితం ఆధారంగా ఓ బయోపిక్ నిర్మిస్తే అందులో అక్షయ్ కుమార్(Akshay Kumar) లేదా రణదీప్‌ హుడా(Randeep Hooda) తన పాత్రలో నటించాలని కోరుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టాడు. 


ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించడంతో మీడియా మరోమారు బయోపిక్ విషయాన్ని నీరజ్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే... తనకు ప్రస్తుతానికి బయోపిక్ గురించి ఆలోచించే సమయం లేదని నీరజ్ స్పష్టం చేశాడు.‘ప్రస్తుతం నా దృష్టంతా ఆటపైనే ఉంది. బయోపిక్ విషయంలో మరికొంత కాలం వేచి చూడాల్సిందే. నేను రిటైరయ్యాక..నా జీవితం ఆధారంగా సినిమా తీస్తే తీయచ్చు. నేను క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి, భారత కీర్తి ప్రతిష్ఠలను కొత్త శిఖరాలకు చేర్చాలనుంది. రిటైరయ్యే నాటికి ఓ అథ్లేట్‌గా గౌరవాభిమానాలు, మరిన్ని విజయాలు సంపాదిస్తే.. అప్పుడు బయోపిక్‌లో నా గురించి చెప్పుకునేందుకు బోలెడన్ని విషయాలు ఉంటాయి’అని నీరజ్ చెప్పాడు. 


టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) ఆదివారంతో ముగిశాయి. భారత జట్టు ఇప్పటికే దేశ రాజధాని దిల్లీ(Delhi) చేరుకుంది. ఈ రోజు సాయంత్రం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం జరగనుంది. ముందు గ్రౌండ్‌లో అట్టహాసంగా చేద్దామనుకున్నారు. కానీ, కరోనా, వాతావరణం అనుకూలించకపోవడంతో అశోక హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. 






అథ్లెటిక్స్‌లో పతకం కోసం భారత్ 100 ఏళ్ల నుంచి ఎదురుచూస్తోంది. ఈ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా పతకం తేవడంతో ఆ నిరీక్షణకు తెరపడినట్లైంది.