Vijay Nirmala elder brother Ravi Kumar is no more: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. భోగి పండుగ నాడు సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కుటుంబంలో తీరని శోకం నెలకొంది. తమ కుటుంబంలో ఓ సభ్యుడిని కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే...


విజయ నిర్మల సోదరుడు మృతి
దివంగత నటి, ప్రముఖ దర్శక - నిర్మాత, అత్యధిక చిత్రాలకు మహిళగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకున్న శ్రీమతి విజయ నిర్మల గురించి ప్రేక్షకులకు తెలుసు. జూన్ 29, 2019లో ఆవిడ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.


నటిగా, దర్శక నిర్మాతగా విజయ్ నిర్మల విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఆమె అన్నయ్య ఎస్. రవి కుమార్ ఒకరు. విజయ నిర్మలకు చెందిన శ్రీ విజయ కృష్ణ మూవీస్ నిర్మాణ సంస్థ రథసారథిగా నిర్మాణ నిర్వహణ బాధ్యతలు ఆయన చూసుకున్నారు. 'మీనా', 'కవిత', 'అంతం కాదిది ఆరంభం', 'హేమాహేమీలు' తదితర చిత్రాలకు ఆయన పని చేశారు. ఈ రోజు (జనవరి 14న) ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. పండుగ నాడు కృష్ణ - విజయ నిర్మల ఫ్యామిలీకి ఆయన మరణం తీరని శోకం మిగిల్చింది.


Also Read: అమెరికాలో 'నా సామి రంగ' ఎర్లీ ప్రీమియర్ షోలు పడలేదు - ఎందుకంటే?


విజయ నిర్మల తనయుడు, రవి కుమార్ మేనల్లుడు నరేష్ విజయకృష్ణ తెలుగులో అగ్ర నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు హీరోగా పలు హిట్ సినిమాలు చేసిన నరేష్... ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. రవికుమార్ తమ్ముడి మనవడు శరణ్ కుమార్ 'మిస్టర్ కింగ్' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు. 


Also Read: డ్యాన్సుల్లో శ్రీ లీలకు పోటీ లేదుగా... స్టార్స్ సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ తెలుగమ్మాయే


జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ పరిధిలో గల మహాప్రస్థానంలో రవికుమార్ అంతిమ సంస్కారాలు నిర్వహించారని కృష్ణ, విజయ నిర్మల ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


కృష్ణ కుటుంబానికి కలిసిరాని 2022
2022లో కృష్ణ ఫ్యామిలీ వరుస విషాదాలు చవి చూసింది. ఆ ఏడాది జనవరి 8న కృష్ణ పెద్ద కుమారుడు, హీరోగా కొన్ని సినిమాలు చేసిన రమేష్ బాబు మరణించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 28, 2022న కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. భార్య మరణించిన రెండు నెలలకు... నవంబర్ 15, 2023లో కృష్ణ ఘట్టమనేని కన్ను మూశారు. తండ్రి మరణంతో మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల జరిగిన 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ వేడుకలో కూడా తండ్రిని గుర్తు చేసుకున్నారు.


Also Read: 'యాత్ర 2'లో వైఎస్ షర్మిల పాత్ర ఉండదు - అన్నయ్య సినిమాలో చెల్లికి చోటు లేదా? జగన్ సినిమా నుంచి చెల్లెల్ని ఎందుకు తీసేశారు?