మరాఠా మందిర్ సినిమా థియేటర్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ ఇటీవల విజయ్ దేవరకొండ యాటిట్యూడ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి విజయ్ దేవరకొండ నేరుగా ఆయన్ని కలుసుకున్నాడు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మనోజ్ ను కలవడానికి ముంబై వెళ్లాడు విజయ్. లైగర్ హీరో తనతో సమావేశం కావడం పట్ల మనోజ్ దేశాయ్ సంతోషం వ్యక్తం చేశారు. “తన వ్యాఖ్యల మీద ఉన్న అపార్థాన్ని క్లియర్ చేసేందుకు విజయ్ ముంబైకి వచ్చాడు. ఒక స్టార్ గా అతడు మంచి మర్యాదను చూపించాడు. ఇక ముందు మంచి సినిమాలను చేస్తానని హామీ ఇచ్చాడు” అని మనోజ్ దేశాయ్ తెలిపారు.
ఆశించని ఫలితమివ్వని ‘లైగర్’
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు నెలకొల్పుతుందని అందరూ భావించినా.. తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఫ్లామ్ మీద రకరకాల కామెంట్లు వచ్చాయి. పూరి జగన్నాథ్ కథ, కథనం, దర్శకత్వం మీద కొందరు విమర్శలు చేస్తుంటే.. మరికొందరు విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైగర్ సినిమా విడుదలకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
విజయ్ దేవరకొండకు అహంకారం
బాయ్ కాట్ బాలీవుడ్ అనే ట్రెండ్ కొనసాగుతున్న వేళ.. విజయ్ కావాలని ఆ వివాదంలోకి వెళ్లాడనేది పలువురి ఆరోపణ. బాయ్ కాట్ చేస్తే చేయనివ్వండి అంటూ ఆయన మాట్లాడిన మాటలు సినిమా పరాజయం మీద భారీ ప్రభావాన్ని చూపించాయని వాదిస్తున్నారు. ముంబైలో జైటీ గెలాక్సీ, మరాఠా మందిర్ సినిమా థియేటర్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ మండిపడ్డారు. విజయ్ దేవరకొండను అహంకారిగా ఆయన అభివర్ణించారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు.
దేవరకొండ కాదు... అనకొండ, అనకొండలా మాట్లాడుతున్నాడని మనోజ్ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ ప్రవర్తన థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ మీద తీవ్ర ప్రభావం చూపించిందని ఆయన పేర్కొన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని, ఇప్పుడు అదే జరుగుతుందని మనోజ్ దేశాయ్ అన్నారు. తమకు సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయని, అయితే ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు బుకింగ్స్ మీద ఇంపాక్ట్ చూపించాయని మనోజ్ దేశాయ్ తెలిపారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ తెరకెక్కింది. అనన్య పాండే హీరోయిన్ గా చేసింది. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన లైగర్ ను కరణ్ జోహార్, చార్మీ కౌర్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read : ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న సకల అస్త్రాలకు అధిపతి