తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం (ఆగస్టు 28) పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, తెలంగాణ ఎమ్మెల్సీ రేగ కాంతారావు, ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులు దర్శించుకున్నారు. వీరంతా వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వారికి అర్చకులు రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ప్రభుత్వ విఫ్ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. ఆది జాంబవంతుడి ఆలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీటీడీని కోరామని అన్నారు. గుంటూరులో అరుంధతి మాత దేవాలయం కట్టాలని కోరినట్లు తెలిపారు.
విభేదాలపై స్పందన
సీఎం జగన్ తనకు ప్రభుత్వ విప్ ఇవ్వడం చాలా సంతోషమని అన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి నాయకత్వంలో దేశంలో అభివృద్ధి పథంలో నడుస్తోందని అన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జోడు గుర్రాల లాగా సీఎం జగన్ పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. విద్య వైద్య రంగాల్లో అనూహ్య మార్పులు సీఎం జగన్ తీసుకు వచ్చారని కొనియాడారు. ప్రజలు మంచి విద్య వైద్యం పొంది తమకు దూరం అవుతారనే నెపంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాయని మండిపడ్డారు. నియోజకవర్గంలో నెలకొన్న విబేధాలు తాత్కాలికం అని, శ్రీదేవి నాయకత్వంలో అందరం కలసి పని చేస్తామని డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు.
తాడికొండలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ
గుంటూరు జిల్లా తాడికొండలో ఎమ్యెల్యే శ్రీదేవి వర్గం - ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వర్గం పోటాపోటీ నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నియామకంతో.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గం భగ్గుమంది. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. రెండ్రోజుల క్రితం డొక్కా గో బ్యాక్ అంటూ ఎమ్యెల్యే వర్గం, ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకంగా డొక్కా వర్గీయుల పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరు వర్గాల మోహరింపుతో అప్రమత్తమైన పోలీసులు రంగ ప్రవేశం చేసి చర్చలు జరిపారు. తాడికొండలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని చెప్పేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలి తప్ప.. ఇలా రోడ్కెక్కకూడదని సూచించారు.
రెంట్ కట్టిన డిపాజిట్లు కూడా వెనక్కి రాట్లేదు - బీటెక్ రవి
తిరుమల శ్రీవారిని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి కూడా దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ.. తిరుమలలో రాజకీయం మాట్లాడటం తగదని అన్నారు.. టీటీడీలో రూమ్ రెంటుకు కట్టిన డిపాజిట్ త్వరగా రావడం లేదని, కారణం ఏంటి అంటే ఆ డిపాజిట్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటుందని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. ఇంత దీన స్థితికి జగన్ ప్రభుత్వం దిగజారడం శోచనీయమని అన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.