Kotla Narsimhulapalli: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కోట్ల నర్సింహులపల్లె చుట్టూ ఎత్తైన గుట్టల మధ్య నరసింహ స్వామి ఆలయం ఉంది. దేవుని గుట్ట మీద నరసింహ స్వామి అపురూప శిల్పంతో పాటు కోటలు ఉండటం వల్ల ఈ గ్రామానికి కోట్ల నర్సింహుల పల్లె అనే పేరు వచ్చింది. దేశంలో మొత్తం మీద ఇటువంటి అష్ట(8)ముఖ, షోడశ(16)బాహు నరసింహమూర్తి ఉండటం చాలా అరుదు. శైవాగమంలో పేర్కొన్న ఉపాసకమూర్తి (తంత్ర) నారసింహుడు, వైష్ణవంలో దశావతారాలలో ఒక అవతారంగా ఆరాధింపబడుతున్నాడు.
చెంచులక్ష్మి కథ.. నరసింహ స్వామికి, గిరజనులకున్న అనుబంధాన్ని చెప్పే పురాణం. నరసింహస్వామి మూర్తులు కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాక రెండు చేతుల నుంచి 32 చేతులు కలిగి కనిపిస్తాయి. లక్ష్మీ సహితంగా, లక్ష్మీదేవి లేకుండాను ఉంటాడు. హిరణ్య కశ్యపుని సంహరిస్తున్న రూపంలో కూడా దర్శనం ఇస్తాడు. యోగానంద రూపంలో కనిపిస్తాడు. లక్ష్మీ సహితంగా... శృంగారమూర్తిగా కూడా దర్శన భాగ్యం కల్పిస్తున్నాడు. శంకరాచార్య నుంచి విజయేంద్రయతి దాక లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధనలో స్తోత్ర, ధ్యాన మంత్రాలను రచించారు.
ఒక్క కరీంనగర్ ప్రాంతంలోనే 60 దాకా నరసింహస్వామి వెలసిన క్షేత్రాలు ఉన్నాయి. కోట్ల నర్సింహుల పల్లెలో దేవుని కొండగా పిలువబడే గుట్టకు చెక్కి కనిపించే 8 తలల, 16 చేతుల నరసింహస్వామి అత్యంత అరుదైన తాంత్రిక మూర్తే. శిల్పం శైలి రీత్యా రాష్ట్ర కూటుల (7 నుంచి 10వ శ. వరకు) కాలానికి చెందింది. కోట్ల నరసింహుల పల్లె గ్రామంలో కనిపించే కోట ఆనవాళ్ళు వివిధ కాలాల్లో కట్టినట్లు, వేర్వేరు విధంగా కట్టడాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నరసింహమూర్తిలో రెండు తలలు స్పష్టంగా, ఒక తల రాలిపోయినట్టుగా, మిగతా తలలు ఛాయామాత్రంగా కనిపిస్తున్నాయి. మిగిలివున్న శిల్పం కుడివైపు చేతులలో రెండు చేతులు హిరణ్యకశ్యపుని పొట్ట చీల్చుతున్నట్టుగా, మిగతా చేతులు ఆయుధాలు ధరించి ఉన్నాయి. కుడివైపు 8 చేతులు, ఎడమ వైపు 7చేతులు మిగిలి ఉన్నాయి.
12 శతాబ్దాల చరిత్ర...ఈ మూర్తిని రాష్ట్రకూట చక్రవర్తి దంతి దుర్గుని(8వ శతాబ్దం) నాటి ఎల్లోరా దశావతారగుహ-15లో, నందివర్మ(730-795) కాంచీపురంలో వైకుంఠ పెరుమాళ్ గుడిలోని పోరాట దృశ్యంలోని నరసింహ మూర్తులను పోలి ఉందని చరిత్ర కారుడు కీర్తికుమార్ తెలిపారు. గుట్ట మీద నందరాజుల నాటిదిగా చెప్పుకునే రాతికోట శిథిలాలు అగుపిస్తాయి. నరసింహాలయానికి ఎదురుగా సీతారామాలయం, దానికవతల 16 స్తంభాల అర్థ మంటపం కనిపిస్తుంది. ఈ నిర్మాణం మనకు బాదామీ చాళుక్యుల కాలం నుంచి కనిపించే ఒక శైలి. శంకరాచార్యుడు దర్శించాడని నమ్మే విశ్వనాథాలయం కూడా ఇక్కడే ఉంది. పక్కన నీటి ఊటల కోనేరు ఉంది.
చైత్ర పౌర్ణమి నుంచి మూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు..
గుడివద్ద కల్వకోట కీర్తికుమార్ పేరుతో వేయించబడిన శిలా ఫలకం మీద ‘1885లో కల్వకోట క్రిష్ణయ్య (రామడుగు) దేశపాండ్యకు స్వప్నసాక్షాత్కారం ఇచ్చిన నరసింహ స్వామి తనకు గుడి కట్టించమన్నాడట. నరసింహ స్వామి గుడిని పునరుద్ధరించిందే వీరే. వీరి వంశస్తులే దేవాలయ ధర్మకర్తలు. ఇక్కడ ప్రతియేటా చైత్ర పౌర్ణమి నుంచి 3 రోజులు బ్రహ్మోత్సవాలు, రామనవమి, వైకుంఠ ఏకాదశి, నరసింహ జయంతి వేడుకలు జరుగుతాయని గ్రామస్థులు చెబుతున్నారు. నరసింహ స్వామి విగ్రహ శైలి పంచముఖ, షోడశ బాహు మూర్తిగా చెప్పబడింది. ఈ శిల్పం క్రీ.పూ. 321లో శాతవాహనరాజు శ్రీముఖుని కాలం నాటిదని వివరించారు. కానీ ఈనాటికి శాతవాహనులు చెక్కించిన దేవతా శిల్పాలు ఎక్కడ కూడా లభించిన ఆధారాలు లేవు.
పార్శ్వనాథుని శిల్పం..
శాతవాహనుల కాలంనాటి డిజైన్లు ఉన్న కుండ పెంకులు (కోటిలింగాల, కొండాపూర్) దొరికాయి కూడా. గ్రామంలో మట్టి ఒరల బావులు ఉన్నాయని కూడా గ్రామ ప్రజలు వివరిస్తున్నారు. పెద్ద ఇటుకల ముక్కలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. అన్నిటికన్నా విశేషం ఇక్కడ ఒక పొలంలో ఋషభుని ధ్యానాసన శిల్పం, పార్శ్వనాథుని శిల్పం బయట పడడం. పార్శ్వనాథుని శిల్పం ఏడు పడగలతో గొడుగు పట్టిన సర్పంతో, దిగంబరంగా, కాయోత్సర్గ భంగిమలో నిల్చుని వున్న పార్శ్వనాథుని పాదాల వద్ద ఇరువైపుల యక్ష, యక్షిణులిద్దరు ఉన్నారు. శిల్పశైలి కళ్యాణీ చాళుక్యుల నాటిది. ఈ విధంగా అపూర్వ శిల్ప సంపదతో అలారారుతున్న ఈ ఆలయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వానికి ఉంది.