తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) అభిమానులకు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులకు శుభవార్త. ఆయన క్షేమంగా ఉన్నారు.
 
విజయ్ ఆంటోనీ సేఫ్. ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రమాదానికి గురైన తర్వాత ఆయన తొలిసారి ట్వీట్ చేశారు. సర్జరీ పూర్తైందని చెప్పారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. అందులో ఆయన ఏం చెప్పారంటే... 


త్వరలో మీతో మాట్లాడతా! - విజయ్ ఆంటోనీ
''డియర్ ఫ్రెండ్స్... మలేషియాలో 'పిచ్చైకారన్ 2' ('బిచ్చగాడు 2') చిత్రీకరణ చేస్తున్న సమయంలో నా దవడ, ముక్కు భాగాలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వాటి నుంచి సురక్షితంగా కోలుకున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తి అయ్యింది. వీలైనంత త్వరలో మీ అందరితో మాట్లాడతాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్'' అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు. థంబ్స్ అప్ సింబల్ కూడా చూపించారు. అది సర్జరీ జరిగిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద నుంచి తీసిన ఫొటోలా ఉంది. తన ఆరోగ్య పరిస్థితి పట్ల ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన నుంచి ఈ ట్వీట్ వచ్చింది. 






సంగీత దర్శకుడిగా ప్రయాణం పారంభించిన విజయ్ ఆంటోనీ... తర్వాత హీరోగా మారారు. తమిళంలో పలు చిత్రాలకు ఆయన అందించిన సంగీతం విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. శ్రీకాంత్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'మహాత్మా'కు ఆయనే సంగీత దర్శకుడు. ఇక, హీరోగా మారిన తర్వాత కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చారు. 


'బిచ్చగాడు' విజయ్ ఆంటోనీ కెరీర్ మొత్తం మీద పెద్ద హిట్. తమిళంలో మాత్రమే కాదు... తెలుగులో కూడా భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ 'పిచ్చైకారన్ 2' (తెలుగులో బిచ్చగాడు 2') చేస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. 


Also Read : చరిత్రకు ఒక్క అడుగు దూరంలో 'నాటు నాటు' - ఆస్కార్ నామినేషన్ వచ్చిందోచ్


మలేషియాలో 'బిచ్చగాడు-2' షెడ్యూల్ ప్లాన్ చేశారు. యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో విజయ్ ఆంటోనీని హుటాహుటిన కౌలలాంపూర్ ఆస్పత్రికి తరలించారు. తొలుత ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వార్తలు వచ్చాయి. విజయ్ ఆంటోనీ ట్వీట్ చేయడంతో అటువంటిది ఏమీ లేదని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 


విశ్వసనీయ సమాచారం ప్రకారం... 'బిచ్చగాడు-2' చిత్రీకరణలో భాగంగా నీటిలో ఓ యాక్షన్ సీన్ చేస్తున్నారు. అందులో విజయ్ ఆంటోని వాటర్ బోటును డ్రైవ్ చేస్తున్నారు. బోటు మీద వేగంగా వెళ్తున్న సమయంలో ఒకసారి అదుపు తప్పడంతో కెమెరా సిబ్బంది ఉన్న పెద్ద బోటును ఢీ కొట్టింది. దాంతో  విజయ్ ఆంటోనీకి గాయాలు అయ్యాయి. 
'బిచ్చగాడు' చిత్రానికి శశి దర్శకత్వం వహించారు. అయితే, సీక్వెల్ దర్శకత్వ బాధ్యతలు ఆయన తీసుకోలేదు. తొలుత 'బిచ్చగాడు 2'కు ప్రియ కృష్ణస్వామిని  దర్శకుడిగా అనుకున్నారు. కొన్ని కారణాలతో ఆయన సినిమా నుంచి వైదొలిగారు.  దీంతో హీరో విజయ్ ఆంటోనీనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సీన్స్ చేయాలని అనుకోవడం యాక్సిడెంట్ అయినట్లు టాక్. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Also Read : ఆస్కార్ బరిలో ఎవరెవరు ఉన్నారు? ఫుల్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో!