ఒక్క అడుగు... ఒక్క అడుగు... 'ఛత్రపతి'లో ప్రభాస్ నోటి వెంట వచ్చిన ఈ మాటే ఈ క్షణం యావత్ భారత దేశం నోటి వెంట వినబడుతోంది. ఇంకొక్క అడుగు మాత్రమే... చరిత్ర సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో 'నాటు నాటు...' (Naatu Naatu Song) పాట నిలిచింది. 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) సినిమాలో పాటకు ఆస్కార్ నామినేషన్ లభించింది. దాంతో ఇప్పుడు భారతీయ ప్రేక్షకులు అందరి దృష్టి మరోసారి ఆస్కార్ అవార్డుల మీద పడింది.
'నాటు నాటు...'కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్... ఇద్దరికీ ఆ అవార్డును సంయుక్తంగా ఇచ్చారు. గోల్డెన్ గ్లోబ్ వేదికపై కీరవాణి సగర్వంగా ఆ పురస్కారాన్ని సగర్వంగా అందుకున్నారు. ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ, క్రిటిక్స్ ఛాయస్ మూవీ అవార్డ్స్ నుంచి ఉత్తమ పాటగా 'నాటు నాటు...'కు అవార్డు వచ్చింది.
లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి గాను ఎం.ఎం. కీరవాణి అవార్డు అందుకున్నారు. ఆయనకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా అవార్డు ఇచ్చారు. అయితే, అందరి చూపు ఆస్కార్ నామినేషన్ మీద ఉంది. ఎందుకు అంటే... ప్రపంచ సినిమాలో అన్ని అవార్డులకు పెద్దన్నగా అకాడమీ పురస్కారాలను చూస్తారు కాబట్టి! ఆస్కార్ షార్ట్ లిస్టులో 'నాటు నాటు...' చోటు సంపాదించుకున్న తరుణం నుంచి నామినేషన్ డిస్కషన్ నడుస్తోంది.
ఆ 15 పాటల్లో 'నాటు నాటు...' ఒకటి!
ద అకాడమీ అవార్డ్స్ (అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్) మొత్తం 23 విభాగాల్లో అవార్డులు ఇస్తుంది. అందులో 10 విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాల వివరాలను డిసెంబర్ 22న వెల్లడించింది. నామినేషన్స్ కంటే ముందు షార్ట్ లిస్ట్ అనౌన్స్ చేశారు. సాంగ్స్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయిన 15 పాటల్లో 'నాటు నాటు...' ఉంది.
Also Read : సక్సెస్ కోసం సౌత్ సినిమాల వెంట బాలీవుడ్ స్టార్స్!? మన సినిమాలతో హిట్లు కొడతారా?
'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో పదిహేను పాటలను షార్ట్ లిస్ట్ చేసినట్లు ఆస్కార్ పేర్కొంది. మొత్తం 81 పాటలు ఈ విభాగంలో పోటీ పడటానికి అర్హత సాధించగా... అందులో 15 పాటలను మాత్రమే షార్ట్ లిస్టుకు ఎంపిక చేశారు. ఆ పదిహేనులో 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' ఒకటి.
మార్చి 23న విజేతలు ఎవరో తెలుస్తుంది!
ఈ రోజు ఆస్కార్ నామినేషన్స్ వెల్లడించారు. మార్చి 23, 2023న విజేతల వివరాలు వెల్లడిస్తారు. ఆ రోజు ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ జరగనుంది. ఇప్పుడు వచ్చిన నామినేషన్స్ బట్టి... గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? అనేది అంచనా వేయడం మొదలు అవుతుంది.
Also Read : 'ముంబై పోలీస్'కు 'హంట్' రీమేకా? - సుధీర్ బాబు ఏం చెప్పారంటే?
మన ఇండియా నుంచి 'చెల్లో షో' (ద లాస్ట్ ఫిల్మ్ షో) 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్' కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయ్యింది. 'బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్' కేటగిరీలో 'ఆల్ ద బ్రీత్స్'... 'బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్' కేటగిరీలో 'ద ఎలిఫాంట్ విష్పర్స్' కూడా షార్ట్ లిస్ట్ అయ్యాయి.