Australian Open 2023:  ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో సానియా మీర్జా- రోహన్ బోపన్నల జోడీ సెమీఫైనల్ లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు ముందు వారి ప్రత్యర్థులు జెలెనా ఒస్టాపెంకో- వేగా హెర్నాండెజ్ లు తప్పుకోవటంతో భారత జోడీకి వాకోవర్ లభించింది. అంతకుముందు. సానియా- రోహన్ ల జోడీ ఏరియల్ బెహర్- మకాటో నినోమియాను 6-4, 7-6 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 


చివరి గ్రాండ్ స్లామ్


ఆస్ట్రేలియన్ ఓపెన్ సానియా మీర్జాకు చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ. ఆరు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన సానియా.. ఈ ఫిబ్రవరిలో జరిగే దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ తర్వాత రిటైర్ కానున్నట్లు ఈ మధ్యనే ప్రకటించింది. ఇప్పుడు మిక్స్ డ్ డబుల్స్ లో సెమీఫైనల్ కు చేరుకోవడం ద్వారా తన ఖాతాలో మరో టైటిల్ చేర్చుకునే అవకాశం సానియాకు లభించింది. 


డబుల్స్ లో ఔట్ 


సానియా మీర్జా- రోహన్ బోపన్నల క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థులు జెలెనా ఒస్టాపెంకో- వేగా హెర్నాండెజ్ లు వైదొలగడానికి గల కారణాలేంటో తెలియలేదు. ఈ టోర్నీలో డబుల్స్ లో సానియా- అన్నా డానిలినా జోడీ రెండో రౌండ్ లోనే ఇంటిముఖం పట్టింది. 


రిటైర్మెంట్ లేఖ





జనవరి 13న తన రిటైర్మెంట్ గురించి సానియా మీర్జా సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్టును పెట్టింది. తన టెన్నిస్ ప్రయాణంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.


‘‘నా కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే 50 గ్రాండ్ స్లామ్స్‌పైగా ఆడాను. వాటిల్లో కొన్ని టైటిల్స్ గెలిచాను. గెలిచిన తర్వాత స్టేడియంలో త్రివర్ణ పతాకంతో నిలబడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ అమ్మాయి, టెన్నిస్ ప్రపంచంలో ఎన్నో విజయాలు అందుకోగలిగిందంటే సామాన్య విషయం కాదు. నా గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని  2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో మొదలెట్టా.. అక్కడే నా కెరీర్‌ను  ముగించడం సమంజమని భావిస్తున్నా..’’ అని సానియా మీర్జా లేఖలో పేర్కొంది. 2003లో అంతర్జాతీయ ఆటలోకి అడుగుపెట్టిన సానియా మీర్జా 2005లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో తన ప్రొఫెషనల్‌ కెరీర్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు 6 సార్లు డబుల్స్ మేజర్ టైటిల్స్ గెలిచింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో ఉమెన్స్ సింగిల్స్‌లో రజతం గెలిచింది.