హిందీ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాది సినిమాలు భారీ వసూళ్ళు సాధిస్తున్నాయి. నార్త్‌తో సౌత్‌ సినిమాలకు ఆదరణ బావుంది. గత ఏడాది చూస్తే... 2022లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో 'కెజియఫ్ 2', 'ఆర్ఆర్ఆర్' మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన 'కార్తికేయ 2' భారీ విజయం సాధించింది. 'కాంతార' గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


ఒకవైపు సౌత్ సినిమాలు వసూళ్ళ వేటలో దూసుకు వెళుతుంటే... హిందీ స్టార్స్  నటించిన సినిమాలు బాక్సాఫీస్ బరిలో చతికిల పడటంతో 'సౌత్ కంటే నార్త్ ఎక్కడ వెనుక పడుతోంది?' అనే చర్చ మొదలైంది. 'బ్రహ్మాస్త్ర', 'దృశ్యం 2', 'కశ్మీర్ ఫైల్స్', 'గంగూబాయి కతియావాడి' వంటి కొన్నిటిని మినహాయిస్తే మిగతా బాలీవుడ్ సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. ఈ నేపథ్యంలో 2023లో అయినా సరే బాలీవుడ్ ట్రాక్‌లోకి వస్తుందా? అనే డిస్కషన్ మొదలైంది. వేసవి వరకు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు చూస్తే... అందులో నాలుగు ముఖ్యమైన సినిమాలు సౌత్ రీమేక్సే. అవేంటో ఓ లుక్ వేయండి!


బన్నీ 'అల'... 
'షెహజాదా'!
హిందీలో వరుస విజయాలతో దూసుకు వెళుతున్న యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్. 'షెహజాదా'తో ఫిబ్రవరి 10న థియేటర్లలోకి వస్తున్నారు. ఆ సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళకు అర్థమై ఉంటుంది... అది అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ అని! కొన్ని సీన్లు, ఫైట్లు, డైలాగులతో సహా కాపీ పేస్ట్ చేశారు. కాకపోతే మ్యూజిక్ చేంజ్ చేశారు. గ్రాండియర్ యాడ్ చేశారు. 'అల...' హిందీ డబ్బింగ్ విడుదలైంది. మరి, ఈ సినిమాకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? కలెక్షన్స్ ఎలా ఉంటాయి? అనేది చూడాలి.


అది 'సెల్ఫీ' కాదు...
'డ్రైవింగ్ లైసెన్స్'!
ఫిబ్రవరిలో విడుదలకు రెడీ అయిన మరో హిందీ సినిమా 'సెల్ఫీ'. అక్షయ్ కుమార్ & ఇమ్రాన్ హష్మీ నటించారు. ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మలయాళంలో పృథ్వీరాజ్ కుమార్, సూరజ్ వెంజరమూడు నటించిన 'డ్రైవింగ్ లైసెన్స్'కు రీమేక్. 2022లో అక్షయ్ నటించిన ఐదు సినిమాలు విడుదల అయ్యాయి. 'కట్ పుత్లీ' ఓటీటీలో విడుదల కాగా... 'బచ్చన్ పాండే', 'సామ్రాట్ పృథ్వీరాజ్', 'రక్షా బంధన్', 'రామ్ సేతు' థియేటర్లలోకి వచ్చాయి. ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఈ నేపథ్యంలో అందరి చూపు 'సెల్ఫీ' మీద ఉంది.


'భోళా'... 'ఖైదీ'రా!
మార్చి నెలాఖరులో... 30న విడుదల కానున్న అజయ్ దేవ్‌గణ్‌ 'భోళా' కూడా సౌత్ రీమేకే. కార్తీ 'ఖైదీ' ఉంది కదా! ఆ సినిమాను హిందీ నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి త్రీడీలో విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ డాటర్ ఎమోషన్ హైలైట్ చేసింది. అలాగే, త్రిశూలంతో అజయ్ దేవ్‌గణ్‌ చేసిన యాక్షన్ సీన్ కూడా! ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. హిందుత్వ సినిమాలు విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో త్రిశూలం ఆయనకు కలిసి వస్తుందో? లేదో? చూడాలి.  


'కిసీ కా భాయ్... కిసీ కా జాన్'గా
మారిన పవన్ 'కాటమరాయుడు'!
సౌత్ రీమేక్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే హిందీ హీరో సల్మాన్ ఖాన్. ఆయన నటించిన తాజా సినిమా 'కిసీ కా భాయ్... కిసీ కా జాన్'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'కాటమరాయుడు' (తమిళ 'వీరం')కు హిందీ రీమేక్ అది. అందులో హీరోయిన్ పూజా హెగ్డే అన్నయ్యగా విక్టరీ వెంకటేష్ నటించారు. జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్ 21న సినిమా విడుదల కానుంది. 


Also Read : వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య... పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా?  


కార్తీక్ ఆర్యన్ మినహా మిగతా ముగ్గురు స్టార్ హీరోలు గతంలో సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేశారు. అయితే... ఇప్పుడు సౌత్ సినిమాలు హిందీలో భారీ విజయాలు సాధిస్తుండటం, స్ట్రెయిట్ హిందీ సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో ఈ రీమేక్స్ మీద అందరి చూపు పడుతోంది. 


షారుఖ్ ఖాన్ జనవరి 25న 'పఠాన్', రణ్‌వీర్‌ సింగ్‌ ఏప్రిల్ 28న 'రాకీ ఆర్ రాణి కీ ప్రేమ్ కహాని' వంటి స్ట్రెయిట్ సినిమాలతో థియేటర్లలోకి రావడానికి రెడీ అయ్యారు. ఇంకా మరి కొంత మంది హిందీ హీరోల స్ట్రెయిట్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. సౌత్ రీమేక్స్ భారీ విజయాలు సాధిస్తాయా? హిందీ ఫిల్మ్స్ హిట్ అవుతాయా? అనేది చూడాలి.


Also Read : పవన్ కొలతలు కావాలి, బాలకృష్ణ మాట విన్నారా? - 'అన్‌స్టాపబుల్‌ 2' వీడియో గ్లింప్స్ వచ్చేసిందండోయ్