Venkatesh Maha gives strong warning to social media trolls: వెంకటేష్ మహా ఇకపై ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తనపై విమర్శలకు దిగుతున్న వ్యక్తులకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉన్నట్టుండి ఎందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు? అసలు ఏమైంది? వంటి వివరాల్లోకి వెళితే... 


పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను - వెంకటేష్ మహా!
'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మహా... ఆ తర్వాత 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' తీశారు. ఆయనలో దర్శకుడు మాత్రమే కాదు... నటుడు, నిర్మాత కూడా ఉన్నారు. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన 'మార్టిన్ లూథర్ కింగ్' చిత్రానికి వెంకటేష్ మహా సమర్పకులు. రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్', నాని 'అంటే సుందరానికీ' సినిమాల్లోనూ నటించారు.


నాని రీసెంట్ సినిమా 'హాయ్ నాన్న' తనకు నచ్చిందని వెంకటేష్ మహా ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ 'రెండు సినిమాలు తీసి 'కెజియఫ్' మీద కామెంట్స్ చేశారు' అంటూ ఆయనను చులకన చేస్తూ విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన 'కెజియఫ్' మీద వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వాటిని వెటకారంగా గుర్తు చేశారు సదరు నెటిజన్. అప్పుడు వెంకటేష్ మహా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 


''వదిలేస్తే మాట వినరుగా మీరు. సరే చెప్తున్నా వినండి. ఎన్ని సినిమాలు తీశాం అనేది ముఖ్యం కాదు. ఏం సినిమా తీశాం అనేది ముఖ్యం. తెలుగులోని బెస్ట్ సినిమాల్లో కొన్ని నేను తీశానని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంకా బెస్ట్ సినిమాలు తీస్తాను. ఊరుకుంటున్నాం కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే... ఇంక ఊరుకోను'' అని వెంకటేష్ మహా ట్వీట్ చేశారు. బెదిరింపులను దాటుకుని తాను పైకి ఎదుగుతానని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా తనపై విమర్శలు, బెదిరింపులపై తాను వ్యక్తిగతంగా పోరాటం చేస్తానని, అవసరం అయితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని వెంకటేష్ మహా స్పష్టం చేశారు.


సోషల్ మీడియాలో ఎవరనేది తెలియకుండా, తమ ముఖాన్ని బయట పెట్టకుండా పోస్టులు చేస్తున్న వ్యక్తులకు బుద్ధి చెప్పే క్రమంలో తనను అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Also Read: పది మంది అందాల భామలు... పాపం, ఫస్ట్ సినిమాయే డిజాస్టర్ - ఈ అందగత్తెలకు కలిసిరాని 2023!






ఇకపై లైట్ తీసుకోను!
వెంకటేష్ మహా ట్వీట్ తర్వాత ఓ నెటిజన్ 'లైట్ తీసుకో బ్రో' అని రిప్లై ఇచ్చారు. 'సారీ బ్రో! ఇకపై లైట్ తీసుకోను' అని ఆయన సమాధానం ఇచ్చారు. మీ వ్యక్తిగత విషయాలు మాకు ఎందుకు? అని మరో నెటిజన్ ప్రశ్నించగా... 'మరి ఎందుకు ఇక్కడికి జొరబడ్డావ్' అని వెంకటేష్ మహా అడిగారు. 'నెక్స్ట్ మూవీతో కొట్టి చూపించు. వీళ్ళే మూసుకుంటారు. ట్వీట్స్ తో కాదు బ్రదర్' అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. అతడికి ''తప్పకుండా చేద్దాం బ్రదర్. కానీ బ్రిలియన్స్ కొంత టైమ్ తీసుకుంటుంది కదా! మనం ఏం చేద్దాం! వీళ్ళు ఆపితే నేను ఆపేస్తా'' అని చెప్పారు.


Also Readపిట్ట కొంచెం... కూత ఘనం! భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!