Upasana Konidela Offer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అపోలో సంస్థల ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. కొత్త వ్యాపారాల్లో రాణిస్తుంది. బిజినెస్ ఉమెన్ గా సత్తా చాటుతోంది. మిగతా రంగాలతో పోల్చితే హెల్త్ కేర్ పై ప్రత్యేక శ్రద్ధపెడుతోంది. తను రాణించడంతో పాటు ఆసక్తి ఉన్న మహిళలను వ్యాపార రంగంలో రాణించాలని పిలుపునిస్తోంది. అంతేకాదు, బిజినెస్ రంగంలో యువ మహిళలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.
యువ మహిళా పారిశ్రామికవేత్తలకు ఉపాసన ఆఫర్
తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన పాల్గొన్నది. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె కీల విషయాలు వెల్లడించింది. హెల్త్ కేర్ రంగంలో వ్యాపారవేత్తలుగా మారాలనుకునే యువ మహిళలకు అండగా ఉంటానని చెప్పుకొచ్చింది. “హెల్త్ కేర్ రంగంలో బిజినెస్ చేయాలనుకునే యువ మహిళల కోసం నేను ఎదురుచూస్తున్నాను. నేను మీకు ఓ ఫౌండర్ గా వ్యవహరిస్తాను. నేను మీ భాగస్వామిగా ఉంటాను. మీకు సాయం చేస్తాను. ఇండియాలో హెల్త్ కేర్ వ్యవస్థను మార్చడానికి మీతో ఉంటాను” అని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
మీరు వివరాలను నాకు పంపించడండి!
హెల్త్ కేర్ రంగంలో ముందుకు వెళ్లాలి అనుకునే వాళ్లు తమ వివరాలను పంపించాలంటూ ఉపాసన వెల్లడించింది. “హెల్త్ కేర్ రంగంలో ముందుకు వెళ్లాలి అనుకునే మహిళలు నాతో చేతులు కలపండి. మీ వ్యాపారానికి సంబంధించిన పర్పస్ ఏంటి? ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది? మీ బిజినెస్ ఎలాంటి పాజిటివిటీని అందిస్తుంది? నన్ను మీరు ఎందుకు ఓ ఫౌండర్ గా ఎందుకు కోరుకుంటున్నారు? లాంటి వివరాలను cofounder@urlife.co.in ద్వారా పంపించండి” అని వెల్లడించింది. హెల్త్ కేర్ రంగంలో పని చేయాలనుకునే బిజినెస్ ఉమెన్ కు ఉపాసన ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొణిదెల ఉపాసన గురించి..
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనువరాలు అయిన ఉపాసన, హీరో రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కొద్ది నెలల క్రితం పాప పుట్టింది. తమ కుటుంబంలోకి చిన్నారి రావడంతో ఉపాసన, రామ్ చరణ్ కుటుంబాల్లో సంబురాలు మిన్నంటాయి. ఈ పాపకు క్లీంకార అని పేరు పెట్టారు. ఇప్పటికీ అమ్మాయి ఎలా ఉంటుందో బయటకు చూపించలేదు. చెర్రీ దంపతులు చిన్నారితో వెకేషన్లకు వెళ్లినా, ఫేస్ బయటకు కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేశారు. ఉపాసన ఓవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు హెల్త్ కేర్ రంగంలోనూ రాణిస్తోంది. ఇప్పుడు మరికొంత మందికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఉపాసన ఆఫర్ పై మహిళా లోకం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో వరద భీభత్సం - రెండు రాష్ట్రాలకు బాలయ్య భారీ విరాళం, ఎంతంటే...