‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో ఈ వారం రాఖీ పండగ స్పెషల్ జరుపుకుంటున్నారు. కేవలం నవ్వులు మాత్రమే కాదు.. మనసును కదిలించే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఈ ఎపిసోడ్‌లో ఉండబోతున్నట్లు ప్రోమోలో చూపించారు.


చమ్మక్ చంద్ర రీఎంట్రీ


‘జబర్దస్త్’ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నాడు చమ్మక్ చంద్ర. అయితే తను ఆ షోను, పూర్తిగా ఆ ఛానెల్‌ను వదిలేసి చాలా కాలమవుతోంది. జబర్దస్త్ తర్వాత మరో రెండు కామెడీ షోలలో, మరో రెండు ఛానెళ్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసినా.. జబర్దస్త్ ఇచ్చినంత గుర్తింపు ఇంకా ఏదీ ఇవ్వలేకపోయింది. అందుకే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ రాఖీ స్పెషల్ ఎపిసోడ్‌తో చంద్ర మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ స్కిట్‌తోనే రీఎంట్రీ ఇస్తున్నట్టుగా హింట్ ఇచ్చాడు. దాంతో పాటు కరుణ, ఐశ్వర్యలకు అన్నగా నటిస్తూ ఒక డ్యాన్స్ పర్ఫెర్మెన్స్‌ను ఇచ్చి అందరినీ ఇంప్రెస్ చేశాడు.


ఓవైపు నవ్వులు.. మరోవైపు ఎమోషన్


రాఖీ స్పెషల్ ఎపిసోడ్‌లో కొన్ని స్పెషల్ టాస్కులు కూడా జరిగాయి. అసలు కనిపించకుండా తెర వెనుక ఉన్న అన్నల చేతులు చూసి చెల్లెళ్లు వారిని గుర్తుపట్టి రాఖీ కట్టారు. మరి ఎవరు, ఎవరికి రాఖీ కట్టారు? సరిగా గుర్తుపట్టారా లేదా? అనే విషయాలను ఎపిసోడ్ విడుదల అయ్యాక చూడాల్సిందే. ఈ టాస్క్ అనేది చాలా సరదాగా సాగిందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ టాస్క్ అయిన తర్వాత రామ్ ప్రసాద్, మహేశ్.. తమ తమ చెల్లెళ్లపై ఉన్న ప్రేమను చెప్పుకున్నారు. ఇక రోహిణీ అయితే తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన గురించి బయటపెట్టింది. తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడింది. మళ్లీ నడవగలనా అని అనిపించిందా అంటూ యాంకర్ రష్మీ అడిగిన ప్రశ్నకు.. రోహిణీ ఎమోషనల్ అయ్యింది. అలాంటి సమయంలో తన అమ్మే తనకు సపోర్ట్‌గా ఉందని గుర్తుచేసుకుంది.


కిరణం అబ్బవరంకు మొదటి రాఖీ


ఇక రాఖీ స్పెషల్ ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో స్పెషల్ గెస్ట్‌గా తన సినిమాను ప్రమోట్ చేయడానికి కిరణ్ అబ్బవరం వచ్చాడు. గెస్ట్‌గా వచ్చిన కిరణ్‌కు ఇంద్రజ రాఖీ కట్టింది. ఇది రాఖీ కట్టడం తన జీవితంలో మొదటిసారి అని ఇంద్రజ అనగా.. కిరణ్ అబ్బవరం కూడా తాను రాఖీ కట్టించుకోవడం మొదటిసారని అన్నాడు. ఆ తర్వాత ఓ బుల్లితెర నటి.. మా అన్నయ్య చాలా గుర్తొస్తున్నాడు. కాల్స్ కూడా చేసుకోవడం లేదని బాధపడింది. దీంతో ఇంద్రజ ఇప్పుడే ఫోన్ చేయమని ప్రోత్సహించింది. ఆ ప్రోత్సాహంతో ఫోన్ చేసి అన్నయ్యకు మళ్లీ దగ్గరయిపోయింది నటి.


చెల్లిని కోల్పోయిన బబ్లూ


కమెడియన్ బబ్లూ సైతం ఈ ఈవెంట్‌కు హాజరయ్యాడు. అయితే గతేడాది తాను తన చెల్లితో ఆ ఈవెంట్‌కు వచ్చానని, ప్రస్తుతం తాను ఒక్కడే వచ్చానని అన్నాడు. అలా ఎందుకు జరిగింది అని ఇంద్రజ ప్రశ్నించగా.. తన చెల్లి చనిపోయిందన్న నిజాన్ని బయటపెట్టాడు. మెదడులో ఏదో వ్యాధి కారణంగా తన చెల్లి చనిపోయిందన్న విషయాన్ని చెప్పాడు. అందుకే తను గతేడాది చెల్లితో కలిసి వచ్చిన ఈవెంట్‌ను మళ్లీ మళ్లీ చూసుకుంటానని అన్నాడు. అలా తన చెల్లి గురించి తలుచుకొని బాధపడుతున్న బబ్లూకు అక్కడ ఉన్న అమ్మాయిలంతా వచ్చి రాఖీ కట్టి తనను ఓదార్ఛారు.



Also Read: మహేష్ బాబు కోసం హాలీవుడ్ సెలబ్రిటీని రంగంలోకి దించుతున్న రాజమౌళి?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial