Shrimad Ramayanam serial on Gemini Tv: 'రామాయణం'.. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా తనవి తీరని అద్భుత కావ్యం. అలాంటి మహా కావ్యం ఆధారంగా ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు, సీరియల్స్ వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన మరో మైథలాజికల్ టెలివివిజన్ సిరీస్ రాబోతోంది. 'శ్రీమద్ రామాయణం' అనే పేరుతో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ టీవీలో ప్రసారం కాబోతోంది. 


తండ్రి మాట జవదాటని కొడుకుగా, అన్నగా, ఏక పత్నీవ్రతుడిగా, స్నేహితుడిగా, ప్రజల క్షేమం కోసం ధర్మం తప్పని రాజుగా, అందరికి ఆదర్శంగా నిలిచిన శ్రీరాముని గాథను ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. మానవ సమాజానికి ఆదర్శవంతమైన విలువలను చాటి చెప్పిన శ్రీ మహా విష్ణువు అవతార గాథే ఈ 'శ్రీమధ్ రామాయణం' సీరియల్. విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముని జీవితాన్ని ప్రదర్శించబోతున్న ఈ ధారావాహిక, జెమిని టివిలో మే 27వ తేదీ నుంచి టెలికాస్ట్ కాబోతోందని నిర్వాహకులు ప్రకటించారు. 


ఆదికవి వాల్మీకి విరచిత రామాయణం ఆధారంగా 'శ్రీమద్ రామాయణం' సీరియల్ తెరకెక్కించారు. ఇందులో శ్రీ రాముని అవతార విశిష్టత, ఆయన జన్మ వృత్తాంతం, లంకాధిపతి అయిన రావణాసురుడి జన్మ వృత్తాంతం మొదలుకుని రామాయణంలోని అన్ని ఘట్టాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేసారు. అనుభవజ్ఞులైన నటీనటుల పెరఫార్మెన్సు తో, మనుసుని ఆకట్టుకునే డైలాగ్స్ తో, అద్భుతమైన సాంకేతిక విలువలతో అత్యద్భుతంగా ఈ ఎపిక్ మైథలాజికల్ సీరియల్ ను చిత్రీకరించినట్లు మేకర్స్ చెబుతున్నారు. 


Also Read: 'రాక్షస' నుంచి ఆ స్టార్ హీరో తప్పుకున్నాడా? ‘హనుమాన్‌’ దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయా?


'శ్రీమద్ రామాయణం' సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు, ప్రతి రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 7 గంట 30 నిమిషాల వరకు ప్రసారం కానుంది. ఈ సీరియల్ ప్రారంభ సందర్భంగా ''జెమిని టీవీలో కాసుల వర్షం'' అనే కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. మే 27 నుండి జూన్ 1 వరకు ప్రసారమయ్యే ఎపిసోడ్స్ లో ఆరు రోజులపాటు అడిగే ప్రశ్నలకు మిస్డ్ కాల్ ఇచ్చి సమాధానాలను తెలియజేసిన ప్రేక్షకులకు ఈ కాంటెస్ట్ ద్వారా బహుమతులు అందించనున్నారు. ప్రతి రోజూ 500 మంది లక్కీ విజేతలని ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ. 1000 నగదు బహుమతిని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేసారు. దీని కోసం ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జెమిని టీవీ చూడాలని సూచించారు. 






ఇకపోతే రామాయణం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో తీసిన 'ఆదిపురుష్' సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీలో రాఘవగా ప్రభాస్ నటించారు. జానకిగా కృతి సనన్, లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ కనిపించారు. 2023లో వచ్చిన ఈ సినిమా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇక రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో 'రామాయణ' సినిమా రూపొందుతోంది. ఇందులో రావణుడిగా కేజీఎఫ్ ఫేమ్ యష్ నటిస్తుండగా.. సీతాదేవి పాత్రను సాయి పల్లవి పోషిస్తోంది. 


అలానే RRR రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ 'సీత: ది ఇంకార్నేషన్' అనే సినిమా చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అలౌకిక్ దేశాయి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. దీంట్లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇది ఇప్పటి వరకూ మనం చూసిన రామాయణం సినిమాలకు భిన్నంగా సీతాదేవి కోణంలో ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. అయితే వీరి కంటే ముందుగా ఇప్పుడు శ్రీ రామ గాథను, సీతా రాముల ప్రేమ కావ్యాన్ని 'శ్రీమద్ రామాయణం' సీరియల్ రూపంలో జెమినీ టీవీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. మరి ఈ అద్భుత దృశ్యకావ్యానికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. 


Also Read: కాజల్‌కు 'అందరికీ నమస్కారం' తప్ప ఇంకేం రాదా?