Ranveer Singh - Prasanth Varma Movie: ‘హనుమాన్‌’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో హిందీ హీరో రణవీర్ సింగ్ తో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నట్లు టాక్ నడిచింది. అంతేకాదు ఈ సినిమాకు 'రాక్షస', 'బ్రహ్మ రాక్షస' అనే టైటిల్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాకముందే దర్శక హీరోల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినట్లుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.


ప్రశాంత్ వర్మ సినిమా ఫొటో షూట్ కోసం రణవీర్ సింగ్ ఏప్రిల్ నెలలో హైదరాబాద్ వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. జూలైలో సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పుకున్నారు. ఆ తర్వాత ఈ మూవీ గురించి పెద్దగా ఎక్కడా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ లో రణ్‌వీర్ సింగ్ భాగం కావడం లేదని బాలీవుడ్ మీడియా చెబుతోంది. సృజనాత్మక విభేదాల కారణంగా వారు స్నేహపూర్వకంగా విడిపోయారని, భవిష్యత్తులో ఎప్పుడైనా కుదిరితే కలిసి పనిచేసే విధంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని వార్తలు ప్రచారం చేస్తోంది.


నిజానికి 'హను-మాన్' సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత, దానికి సీక్వెల్ గా 'జై హనుమాన్' అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. 2025లోనే థియేటర్లలోకి వస్తుందని కూడా ప్రకటించారు. అయితే దాని కంటే ముందు 'బ్రహ్మ రాక్షస్' చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీదకు తీసుకురావాలని భావిస్తున్నాడట. కానీ ఇప్పుడు రణబీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, మరో స్టార్ హీరోని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి.


ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని మరో వార్త వినిపిస్తోంది. ఆల్రెడీ దర్శకుడు సైలెంట్ గా ‘రాక్షస’ సినిమాని స్టార్ట్ చేశారని.. హైద‌రాబాద్ శివార్ల‌లో ‘హ‌నుమాన్‌’ కోసం వేసిన సెట్‌లోనే షూట్ మొద‌లైంద‌ని అంటున్నారు. కాకపోతే ఈ షూటింగ్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్‌ కోసం మాత్రమే అని, ర‌ణ్‌వీర్ సైతం చిత్రీకరణలో పాల్గొంటున్నారని చెబుతున్నారు. అతి త్వరలోనే స్పెషల్ గ్లింప్స్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. మరి ఈ రూమర్స్ పై చిత్ర వర్గాలు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


Also Read: మోహన్ లాల్ రీమేకు, తెలుగులో హిట్టు  - చిరు, వెంకీ కంటే మోహన్ బాబు, నాగార్జునే ఎక్కువ చేశారుగా


కాగా, 'బ్రహ్మ రాక్షస' అనేది పౌరాణిక నేపథ్యంతో స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే స్టోరీతో సాగే పీరియాడికల్ ఫిల్మ్ అని టాక్ ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగానే ఈ మూవీ ఉండనుందని, ఇందులో హీరో పాత్ర గ్రే షేడ్స్‌తో ఉంటుందని అంటున్నారు. ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో 'ఆక్టోపస్' అనే సినిమా చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించబడతాయి. 


Also Readఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగుకు విమర్శకుల నోళ్లూ మూతపడ్డాయంతే!