సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన విక్టరీ వెంకటేష్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ వసూళ్ల సాధించింది. థియేటర్లలో 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఓటీటీలలోనూ ఈ సినిమాకు రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు టీవీలోనూ దుమ్ము దులిపిందీ సినిమా.
జీ తెలుగులో 'సంక్రాంతికి వస్తున్నాం'కి రికార్డు టీఆర్పీ
మార్చి ఒకటవ తేదీ సాయంత్రం 'జీ తెలుగు' ఛానల్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రీమియర్ షో వేశారు. అదే రోజు జీ5 ఓటీటీలో డిజిటల్ రిలీజ్ కూడా చేశారు. రెండో రోజుకు ఓటీటీలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు టీవీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.
అర్బన్ ఏరియాలలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 15.92 టీఆర్పీ నమోదు చేసింది. ఇది ఒక రికార్డ్. జీ తెలుగు ఛానల్ టీవీ టీఆర్పీ హిస్టరీలో సెకండ్ హైయెస్ట్ అని చెప్పాలి. ఐదేళ్ల క్రితం విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాకు 19 టీఆర్పీ వచ్చింది. ఆ తర్వాత 15 ప్లస్ టీఆర్పీ సాధించిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' కావడం గమనార్హం.
థియేటర్లలో సూపర్ రెస్పాన్స్... ఎవరూ ఊహించలేదు!
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు థియేటర్లలో సూపర్ డూపర్ రెస్పాన్స్ లభించింది. మూడు వందల కోట్లకు పైగా వసూళ్ల సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒక వైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్', మరొక వైపు నట సింహం నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సంక్రాంతికి విడుదల కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు వస్తారా? రారా? అనే సందేహాలు ట్రేడ్ వర్గాలలో వ్యక్తం అయ్యాయి. అనూహ్యంగా ఆ రెండు సినిమాలను మించి ఈ సినిమా కలెక్షన్స్ సాధించింది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను అగ్ర నిర్మాత 'దిల్' రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద ఆయన సోదరుడు శిరీష్ నిర్మించారు. ఇందులో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షి చౌదరి నటించారు. వినోదంతో భారీ విజయం సాధించింది. ఈ సినిమాకు భీమ్స్ అందించిన మ్యూజిక్ ప్లస్ అయింది.