మురారీ వాళ్ళని వారం రోజుల పాటు ఫామ్ హౌస్ కి వెళ్ళమని చెప్పడంతో కృష్ణ వాళ్ళకి నిద్రపట్టదు. అత్తయ్య ఈ మధ్య మా ఇద్దరి మీద ఫోకస్ పెడుతుంది దీనికి కారణం ఏంటో అర్థం కావడం లేదని తింగరిపిల్ల ఆలోచనలో పడుతుంది. కొడుకు, కోడలు అగ్రిమెంట్ రద్దు చేసుకుని ఇద్దరి బంధం బలపడేలా చేయమని దేవుడిని వేడుకుంటుంది రేవతి. అలాగే ఆదర్శ్ కూడా తిరిగి వచ్చి ముకుంద జీవితం కూడా బాగుపడాలని కోరుకుంటుంది. పొద్దున్నే కృష్ణ టైమ్ అవుతుందని చెప్పి మురారీని నిద్రలేపుతుంది. తనని చూసి మురారీ మురిసిపోతాడు. కృష్ణ ఇది నువ్వేనా? రోజు అల్లరి పిల్లలా నవ్వులు పూయించే నువ్వు ఇవాళ సరికొత్తగా నా ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన నా భార్యలాగా ఉన్నావని మనసులో అనుకుంటాడు. ఏంటి ఏసీపీ సర్ అలా చూస్తున్నారు బాలేనా అంటుంది. బాపు బొమ్మలాగా ఉన్నావని మెచ్చుకుంటాడు. చీరలో నిజంగా చాలా బాగున్నావ్ నిన్ను ఇలాగే చూస్తూనే ఉండాలని అనిపిస్తుందని చెప్తాడు.


Also Read: రాజ్ దొంగపని చూసేసిన కావ్య- కళ్యాణ్ ని కూలోడిని చేసిన అప్పు


మురారీ రెడీ అయి డైరీ కోసం వెతుకుతాడు. అది కనిపించకపోయే సరికి టెన్షన్ పడతాడు. కృష్ణ వచ్చి ఏంటి వెతుకుతున్నారని అంటే ఏమి లేదని చెప్పి వెళ్ళమని మళ్ళీ వెతుకుతాడు. డైరీ ఇక్కడే పెట్టాను కదా ఏమైంది కృష్ణ చదివిందా?చదివితే హ్యాపీనే నేను తనని ఎంత ప్రేమిస్తున్నానో తెలుస్తుంది. ఒక వేళ ముకుంద గురించి రాసింది మాత్రమే చదివి తన గురించి రాసింది చదవకపోతే ఇక నా పని అయిపోయినట్టేనని టెన్షన్ పడతాడు. చీరలో ఎలా ఉన్నాను అత్తయ్య అని అమాయకంగా అడుగుతుంది. కాసేపు కోడల్ని మెచ్చుకుంటుంది. ఎట్టి పరిస్థితిలో ఆ డైరీ ముకుందకి దొరకకూడదని అనుకుంటాడు. ఇద్దరినీ దేవుడి దగ్గరకి తీసుకెళ్తుంది రేవతి. మీరద్దరూ ఇలా ప్రేమగా నేను కళ్ళు మూసే వరకు అని రేవతి అనేసరికి ఇద్దరూ బాధపడతారు. నేను కళ్ళు మూసేవరకు మీరిద్దరు ఇలాగే ప్రేమగా సంతోషంగా తన కళ్ళ ముందు ఉండాలని మాట ఇవ్వమని అడుగుతుంది. ఏసీపీ సర్ మనసులో ఇంకా డైరీ అమ్మాయి ఉందా? తన మనసులో నా స్థానం ఏంటని కృష్ణ ఆలోచిస్తుంది.


Also Read: రౌడీలని చితక్కొట్టి ఖుషిని కాపాడుకున్న వేద- అభి తలకి గన్ గురిపెట్టిన యష్


అగ్రిమెంట్ అయిపోగానే కృష్ణ వెళ్లిపోకుండ తన ప్రేమని అర్థం చేసుకుని జీవితాంతం భార్యగా ఉండాలని మురారీ దేవుడిని వేడుకుంటాడు. వీళ్ళద్దరి మధ్యలోకి ముకుంద రాకుండా చూడమని రేవతి కోరుకుంటుంది. అందరూ సంతోషంగా మురారీ వాళ్ళని సాగనంపుతారు. గది మొత్తం వెతికినా కూడా డైరీ లేదు ఒకవేళ కృష్ణ చదివితే ఇన్ డైరెక్ట్ గా అడిగేది మమ్మీ చూసి ఉంటే పంతుల్ని పిలిచి పెళ్లి చేసేసేదని మురారీ ఆలోచిస్తూ ఉంటాడు. సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్ వచ్చేస్తుంది. మురారీ వాళ్ళ కంటే ముందుగానే ముకుంద ఫామ్ హౌస్ కి వస్తుంది. తను భవానీ దేవి కోడల్ని అని చెప్పి ఆవిడ అవసరంలో ఉంటే డబ్బులు సాయం చేస్తుంది. తను ఇక్కడే ఉంటానని కానీ ఇక్కడ ఉన్న విషయం రేవతి అత్తయ్యకి చెప్పొద్దని ముకుంద చెప్తుంది. తను వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదని అంటుంది. తను వచ్చిన విషయం చెప్తే ఉద్యోగంలో నుంచి తీసేస్తానని వార్నింగ్ ఇస్తుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial