డాక్ట‌ర్ బాబు... ఈ పేరు తెలియ‌ని సీరియ‌ల్ ఫ్యాన్స్ ఉండ‌రేమో. తెలుగులో సూప‌ర్ హిట్ అయిన 'కార్తీక దీపం' సీరియ‌ల్‌లో డాక్ట‌ర్‌ బాబు పాత్ర‌తో బుల్లితెర ప్రేక్ష‌కులను మెప్పించారు నిరుప‌మ్ ప‌రిటాల‌ (Nirupam Paritala). త‌న అస‌లు పేరు కంటే డాక్ట‌ర్‌ బాబుగా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో నిలిచిపోయారు. ప్ర‌స్తుతం 'కార్తీక దీపం' సీరియ‌ల్‌ (Karthika Deepam Serial)కు  సీక్వెల్ చేస్తున్నారు నిరుప‌మ్ ప‌రిటాల‌. 'కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతం' పేరుతో టెలికాస్ట్ అవుతున్న ఈ సీక్వెల్‌ 'స్టార్ మా' ఛానల్‌లో టాప్ రేటింగ్ సీరియ‌ల్‌గా కొన‌సాగుతోంది. ఈ సీక్వెల్‌లో కార్తీక్ బాబు పాత్ర‌లో అద‌ర‌గొడుతున్నాడు నిరుప‌మ్ ప‌రిటాల‌.

Continues below advertisement


సీరియల్ నటుల్లో హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్‌!
తెలుగు సీరియ‌ల్ యాక్ట‌ర్స్‌లో హ‌య్యెస్ట్ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న‌ది నిరుప‌మ్ ప‌రిటాల‌నే అని టాక్‌. సీరియ‌ల్స్‌లో ఒక్కో ఎపిసోడ్‌కు న‌ల‌భై వేల‌కు పైనే డాక్ట‌ర్‌ బాబు రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు స‌మాచారం. బుల్లితెర‌పై టాప్ స్టార్‌గా కొన‌సాగుతున్న నిరుప‌మ్ ప‌రిటాల వెండితెర‌పై మాత్రం ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయారు. యాక్ట‌ర్‌గానే కాకుండా డైలాగ్ రైట‌ర్‌గా కూడా ఓ సినిమాకు ప‌ని చేశాడు డాక్ట‌ర్‌ బాబు. అయితే అవి ఏవీ అత‌డికి విజ‌యాల‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి.
 
'ఫిట్టింగ్ మాస్ట‌ర్' మూవీతో వెండితెరకి నిరుపమ్!
'అల్ల‌రి' న‌రేష్ హీరోగా న‌టించిన 'ఫిట్టింగ్ మాస్ట‌ర్' మూవీతో విల‌న్‌గా టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నిరుప‌మ్ ప‌రిటాల‌. సీరియ‌ల్స్‌లో బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్‌లు అందుకున్న డాక్ట‌ర్‌ బాబుకు సినిమాల్లో మాత్రం తొలి అడుగులోనే  పెద్ద షాక్ త‌గిలింది. 'ఫిట్టింగ్ మాస్ట‌ర్' డిజాస్ట‌ర్‌ కావడంతో డాక్ట‌ర్‌ బాబు యాక్టింగ్ టాలెంట్‌ వెండితెరపై గుర్తింపు దక్కలేదు. ఆయన్ను ఎవ‌రూ పెద్ద‌గా గుర్తించ‌లేదు. ఎన్టీఆర్ 'ర‌భ‌స‌'తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడు. సినిమాలు చేశాడనే పేరు త‌ప్ప అత‌డి కెరీర్‌కు ఏ మాత్రం ఆ సినిమాలు ఉప‌యోగ‌ప‌డ‌లేదు.


వెబ్‌ సిరీస్‌లో హీరోగా నటించిన డాక్టర్ బాబు!
తెలుగు వెబ్‌ సిరీస్‌ 'కుమారి శ్రీమ‌తి'లో నిరుప‌మ్ ప‌రిటాల హీరోగా న‌టించాడు. ఈ సిరీస్‌లో నిత్యా మీన‌న్‌ను ప్రేమిస్తూ... ఆమె ల‌క్ష్యానికి అండ‌గా నిల‌బ‌డ‌మే యువ‌కుడిగా నాచుర‌ల్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. యాక్టింగ్‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా ఆది సాయి కుమార్ హీరోగా న‌టించిన 'నెక్స్ట్ నువ్వే' సినిమాకు డైలాగ్ రైట‌ర్‌గా కూడా నిరూప‌మ్ ప‌రిటాల ప‌ని చేశాడు. 'ఈటీవీ' ప్ర‌భాక‌ర్ దర్శకత్వం వహించిన ఆ హార‌ర్ కామెడీ మూవీ కూడా డిజాస్ట‌ర్‌ అయ్యింది. నిరుప‌మ్ ప‌రిటాల‌ను డిజప్పాయింట్ చేసింది.


Also Read: గుండె నిండా గుడి గంటలు బాలు సక్సెస్... మరో సీరియల్ ఫ్లాప్ - విష్ణుకాంత్ కెరీర్‌లో ఊహించని మలుపు


'అష్టా చెమ్మ'లో నటించే ఛాన్స్ మిస్స‌య్యింది!
మోహ‌న‌ కృష్ణ ఇంద్ర‌గంటి 'అష్టా చెమ్మ‌'తో పాటు ప‌లు తెలుగు సూప‌ర్ హిట్ సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లే వ‌చ్చి చేజారాయ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో నిరుప‌మ్ చెప్పారు. కొన్ని సినిమాల్లో హీరోగా సెలెక్ట్ అయ్యాన‌ని, కానీ షూటింగ్‌ మొద‌ల‌య్యే టైమ్‌లో త‌న‌ను తీసేసి ఆ పాత్ర‌ల‌ను వేరే న‌టుల‌ను సెలెక్ట్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని అన్నారు.


డాక్ట‌ర్ బాబు తండ్రి కూడా యాక్టర్ కమ్ రైటర్!
డాక్ట‌ర్‌ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల తండ్రి ఓంకార్ టాలీవుడ్‌లో ఫేమ‌స్ రైట‌ర్ క‌మ్ యాక్ట‌ర్‌. ఓంకార్ కూడా సినిమాల కంటే సీరియ‌ల్స్‌తోనే ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యారు. దర్శకుడిగా ఓంకార్ 'పందిరి మంచం' అనే సినిమా చేశారు. జ‌గ‌ప‌తి బాబు హీరోగా న‌టించిన ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. 'పోలీస్ భార్య', 'అన్నా త‌మ్ముడు'తో పాటు మ‌రికొన్ని సినిమాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేశారు ఓంకార్‌. యాక్ట‌ర్‌గా కూడా చాలా సీరియ‌ల్స్‌, సినిమాలు చేశారు. 'అలౌకిక‌', 'ప‌విత్ర‌ బంధం', 'నిన్నే పెళ్లాడ‌తా'తో పాటు ప‌లు సీరియ‌ల్స్ ఓంకార్‌కు యాక్ట‌ర్‌గా మంచి పేరు తెచ్చిపెట్టాయి.


Also Readబిగ్‌ బాస్ బాలాదిత్య కొత్త సీరియ‌ల్ టైటిల్ ఇదే - 'వంట‌ల‌క్క‌'కు జోడీగా!