హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త సినిమా వస్తే అభిమానులకు పండగ! అలాగే, టీవీ సీరియళ్ళకు కూడా ఫాన్స్ చాలా మంది ఉంటారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ప్రతి రోజూ కొత్త ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సీరియల్ రన్ చేయడం అంత సులభం ఏమీ కాదు. సూపర్ హిట్ సీరియల్స్ ఎన్నో బుల్లితెర వీక్షకులకు అందించిన 'స్టార్ మా' ఛానల్... మరో కొత్త సీరియల్ తీసుకు వస్తోంది.
అమ్మ కథతో 'గుండె నిండా గుడి గంటలు'
ఈ సారి అమ్మ కథతో 'స్టార్ మా' ఛానల్ సరికొత్త సీరియల్ రూపొందుతోంది. తెలుగు ఇంటి ఆడపడుచులు, ఇళ్ళల్లో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్టార్ మా ఇప్పుడు 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ తీసుకు వస్తోంది. అక్టోబర్ 2న ఈ సీరియల్ ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 9 గంటలకు సీరియల్ టెలికాస్ట్ అవుతుందని 'స్టార్ మా' ఛానల్ తెలియజేసింది.
'గుండె నిండా గుడి గంటలు'లో విష్ణు కాంత్ హీరోగా నటిస్తున్నారు. బాలు పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఆయనకు జోడీగా అమూల్య గౌడ నటిస్తున్నారు. సీరియల్ లో ఆమె పాత్ర పేరు మీనా.
'గుండె నిండా గుడి గంటలు' కథ ఏమిటి?
అమ్మ అంటే దైవం. సృష్టిలో అమ్మను ప్రేమించిన మనిషి ఉండరని చెప్పవచ్చు. అమ్మ మన కళ్ళ ముందు తిరిగే దేవతగా చూసే వారు ఎందరో! బిడ్డకు జన్మ ఇచ్చినప్పటి నుంచి పెంచి పెద్ద చేసే వరకు అమ్మ పాత్ర మరువలేనిది. అటువంటి అమ్మకు దూరమైన ఓ కొడుకు ఏమయ్యాడు? అసలు, తల్లి - బిడ్డ ఎందుకు దూరం అయ్యారు? అనే కథతో 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ తెరకెక్కుతోంది.
Also Read : మానస్, దీపికల 'బ్రహ్మముడి' - ఈ సీరియల్ చెబుతోన్న జీవిత సత్యాలు
తల్లీబిడ్డల అనుబంధం ఎంత గొప్పదో 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్ కథ చెబుతుందని ఛానల్ ప్రతినిధులు పేర్కొన్నారు. మనిషికి కన్నీరు ఎంతగా తోడు నిలబడుతుందో కథలో పాత్రలు చెబుతాయని, ప్రేమను పంచడం అంటే ఎలా ఉంటుందో కథనం ద్వారా తెలుస్తుందని, కఠినమైన మనసును కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుందని సన్నివేశాలు వివరిస్తాయని తెలిపారు.
కథలో అమ్మాయి పాత్ర కూడా కీలకమే!
'గుండె నిండా గుడి గంటలు'లో తల్లి కుమారుల పాత్రలతో పాటు ఓ అమ్మాయి పాత్ర కీలకంగా ఉండబోతోంది. దారి తప్పిన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకునే అమ్మాయి ప్రయత్నం, ఆ తల్లికి కొడుక్కి మధ్య దూరాన్ని తగ్గించాలనుకునే తాపత్రయం, తల్లీ కొడుకుల మధ్య అనూహ్యమైన సంఘటనలతో ఈ సీరియల్ పూర్తిగా కొత్త భావోద్వేగాల్ని అందించబోతోందట.
Also Read : మోసాన్ని సహించలేడు, ఇబ్బంది పడితే తట్టుకోలేడు - ఇదీ 'బ్రహ్మముడి'లో రాజ్ క్యారెక్టరైజేషన్
''పసివాడు తల్లి కోసం ఎంత ఆరాట పడ్డాడో? కన్న తల్లి ఒకసారి కనిపిస్తే చూడాలని ఎంతగా పరితపించాడో? దేవుడిని వేడుకున్నాడో? అతని జీవితం ఎలా గడిచిందో తెలియాలంటే 'గుండె నిండా గుడిగంటలు' చూడాల్సిందే'' అంటోంది 'స్టార్ మా'.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial