Anchor Syamala About AP Politics: ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా ప్రచారాల్లో సెలబ్రిటీలు పాల్గొంటూ తాము మద్దతు ఇచ్చే నాయకులకు ఓటు వేయమని అడగడం, ఇతర పార్టీ నాయకులపై విమర్శలు చేయడం అనేది కామన్ అయిపోయింది. జనసేనాని పవన్ కళ్యాణ్‌ను సపోర్ట్ చేయడానికి ఎంతోమంది సెలబ్రిటీలు రంగంలోకి దిగుతుండగా.. వైసీపీ తరపున యాంకర్ శ్యామలను ప్రచార కార్యకర్తగా పరిచయం చేశారు వైఎస్ జగన్. దీంతో శ్యామల ఏంటి పాలిటిక్స్ వైపుకు వెళ్లిందని చాలామంది ఆశ్చర్యపోయారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో జగన్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ప్రేక్షకులకు తెలివిగా ఒక కథను వినిపించింది శ్యామల.


కన్‌ఫ్యూజన్‌లో కంట్రోల్ తప్పింది..


ప్రస్తుతం వైఎస్ జగన్ చెల్లెలు షర్మిలనే అన్నయ్యకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. అన్నపై బురద జల్లుతూ సొంత పార్టీని ఏర్పాటు చేసుకొని పోటీకి దిగుతున్నారు. దానిపై శ్యామల స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతీ మహిళను వైఎస్ జగన్ చెల్లెలు అనుకున్నారు కాబట్టే ఏపీకి అభివృద్ధి జరిగిందని వ్యాఖ్యలు చేశారు శ్యామల. ‘‘నేను కూడా షర్మిల ఎందుకిలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. ఇక్కడ ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడే ఉండాల్సింది. కానీ లేకుండా ఇంకొకరితో కలిశారు. అలా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఆమె కంట్రోల్ తప్పుతున్నారేమో అని నా ఫీలింగ్’’ అంటూ షర్మిల ప్రవర్తనపై స్పందించారు శ్యామల.


అలాంటి లీడర్ కరెక్టా.?


పవన్ కళ్యాణ్, శ్యామల.. ఇద్దరు ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందినవారే. అలాంటి శ్యామల.. పవన్ కళ్యాణ్‌కు కాకుండా జగన్‌కు సపోర్ట్ చేస్తున్నందుకు ఇండస్ట్రీలో చాలామంది తనకు వ్యతిరేకంగా మారుతారేమో అని అనగా.. శ్యామల ఆ మాటను ఒప్పుకోలేదు. ‘‘ఈ అమ్మాయి వెళ్లి వాళ్లకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఆ అమ్మాయిని ఈవెంట్స్‌కు పిలవద్దు అని ఆలోచించే లీడర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కరెక్టా’’ అంటూ సూటిగా ప్రశ్నించారు శ్యామల. అంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ఏపీకి కరెక్టా అని ప్రజలను ప్రశ్నించారు. అంతే కాకుండా ఏపీ ప్రజలకు అర్థమయ్యేలా ఒక కథను కూడా వినిపించారు శ్యామల.


Also Read: మొదటి సంపాదనతో మందు తాగాను.. ప్రపంచంలో ఎవడైనా అలాగే చేస్తాడు - ‘జబర్దస్త్’ అవినాష్


ముసలి తోడేలు, గుంటనక్కల కథ..


‘‘ఒక పెద్ద అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. దానికి వేటాడే ఓపిక నశించి ఆహారం కోసం ఒక గుంటనక్క సాయం కోరింది. తోడేలుకు ఆహారం తెచ్చిపెట్టే విషయంలో సాయం చేయకపోతే తనను ఆహారంగా తీసుకుంటుందేమో అన్న భయంతో గుంటనక్క.. తోడేలుకు ఆహారం కోసం అడవి మొత్తం తిరుగుతోంది. ఈ గుంటనక్క మాటలను ఒక కుందేలు నమ్ముతుంది. దానిని రాజును చేస్తామని చెప్పగానే తోడేలు దగ్గరకు రావడానికి ఒప్పుకుంటుంది. కుందేలును చూడగానే ఆకలితో ఉన్న తోడేలు ముందుగా దాని చెవులు కొరికేస్తుంది. అసలు జరిగిందేంటో అర్థం కాక కుందేలు పారిపోయే ప్రయత్నం చేస్తుంది. కానీ గుంటనక్క దానిని ఆపి నీకు పెద్ద కిరీటం పెట్టాలనుకుంటున్నాం. దానికి నీ చెవులు అడ్డంగా ఉన్నాయి. అందుకే ముందు దానిని కోసేశాం అని చెప్పింది. కుందేలు ఆ మాట నమ్మి మళ్లీ తోడేలు దగ్గరకు వెళ్లింది’’ అని చెప్పుకొచ్చారు.


‘‘ఈసారి తోడేలు దాని తోక కొరికేసింది. దీంతో మళ్లీ కుందేలు పారిపోయింది. గుంటనక్క మళ్లీ దానిని ఆపి సింహాసనం మీద కూర్చోపెట్టడానికి తోక అడ్డంగా ఉందని చెప్తే మళ్లీ కుందేలు నమ్మి తోడేలు దగ్గరికి వస్తుంది. చెవులు, తోక కొరికేసినా కుందేలు మళ్లీ రావడంతో ఈసారి తోడేలు దాని పీక కొరికేసింది. కుందేలు చనిపోయిన తర్వాత దానిని ముక్కలుగా కోసి తీసుకొస్తే ఇద్దరం తిందామని తోడేలు చెప్తుంది. గుంటనక్క వెళ్లి కుందేలును ముక్కలుగా కోసిన తర్వాత దాని మెదడును ముందే తినేసింది. తోడేలు దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత మెదడు ఏదని అడిగితే.. ఆ బుర్రే ఉంటే మనల్ని కుందేలు ఎందుకు నమ్ముతుంది. ఆ ముసలి తోడేలు, గుంటనక్క ఎవరు అని మీ ఆలోచనకే వదిలేస్తున్నా. సరిగ్గా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి’’ అంటూ ఏపీ నాయకులను జంతువులతో పోలుస్తూ కథ చెప్పారు శ్యామల.


Also Read: ప్రియాంక చోప్రా భర్తకు అస్వస్థత - ఇన్‌ఫ్లుఎంజా-A వ్యాధి బారిన నిక్‌ జోనస్