నాగచైతన్య-సాయిపల్లవి-శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి  విడుదల చేసిన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి ఫుల్ మార్క్స్ పడ్డాయి. ముఖ్యంగా ట్రైలర్లో డైలాగ్స్ బాగా పేలాయంటున్నారు సినీ ప్రియులు.  


‘‘బీటెక్ బీటెక్కే.. డ్యాన్స్ డ్యాన్సే,  బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవాని తన జాబ్ అడిగితే దొబ్బేయ్ అంటాడు, మనకు లోన్లు ఇవ్వరు, రెంటుకు రూములు ఇవ్వరు, పిల్లనిస్తార్రా?, బతుక్కోసం ఈ ఉరుకులాట నాతో కాదింక చస్తే చద్దాం.. కానీ తేల్చుకుని చద్దాం'’ ఈ డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. అయితే ట్రైలర్లో ఉన్న మరో డైలాగ్  తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.


 ఈ సినిమాలో చైతూ-పల్లవి తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ ఆకట్టకున్నాయి. అయితే లోన్ కోసం వెళ్లిన చైతూ ఓ సందర్భంలో ''రిక్షావోడికి కొత్త రిక్షా ఇస్తే వాడు రిక్షా నే తొక్కుతాడు.. గొర్రెలోనికి గొర్రెలు ఇస్తే వాడు గొర్రెలే మేపుతాడు.. ఇంకేమి డెవలప్ అవుతాం సార్'' అనే డైలాగ్ అభిమానులకు అదుర్స్ అనిపించినా.. టీఆర్ఎస్ ఫాలోవర్లకు మాత్రం కాస్త ఇబ్బంది కలిగించిందట. దీంతో శేఖర్ కమ్ముల పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వంపై సెటైర్స్ వేస్తున్నారంటూ కొంతమంది టీఆర్ఎస్ మద్దతుదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.


తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం  గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఓ సామాజిక వర్గాభివృద్ధికి దోహదపడుతుందనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చినప్పటికి అప్పట్లో దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఇప్పుడు 'లవ్ స్టోరీ' సినిమాలో ‘‘గొర్రెలు ఇస్తే గొర్రెలే మేపుతాడు.. ఇంక డెవలప్ ఎలా అవుతారనే’’ డైలాగ్ ద్వారా శేఖర్ కమ్ముల పరోక్షంగా ఆ పథకంపై విమర్శలు చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Also read: ‘లవ్ స్టోరీ’ ట్రైలర్: బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవను జాబ్ అడిగితే పొమ్మంటాడట.. డైలాగ్స్ భలే ఉన్నాయ్!

అయితే శేఖర్ కమ్ములకు అలాంటి ఉద్దేశ్యం  లేదంటున్నారు సినీ ప్రియులు. వరుణ్ తేజ్-సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కించిన ‘ఫిదా’ సినిమాకి సీఎం కేసీఆర్-మంత్రి కేటీఆర్ ఫిదా అయిపోయారు. పిలిచి మరీ ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారంతా. అయినా ఇది కేవలం సినిమాలో సన్నివేశం పండడానికి పెట్టిన డైలాగే కానీ.. దీనివెనుక మరెలాంటి ఉద్దేశం లేదంటున్నారు. నాగచైతన్య, శేఖర్ కమ్ముల, సాయిపల్లవి వీళ్లతో పాటూ ఓవరాల్ గా ‘లవ్ స్టోరీ‘ టీమ్ మొత్తం వివాదాలకు దూరంగా ఉండేవారే. అందుకే ఓ డైలాగ్ ని పట్టుకుని దీనిపై చర్చ చేయడం సరికాదంటున్నారు.


Also read: అపోలో ఆసుపత్రికి కృష్ణంరాజు.. కంగారు పడొద్దన్న రెబల్ స్టార్ టీమ్


Also read: సమంతకు థాంక్స్ చెప్పిన చైతూ.. ఇప్పటికైనా మీకు అర్థమవుతోందా..!