Sirivennela Live Updates: తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి సిరివెన్నెల : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ 

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మంగళవారం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు.

ABP Desam Last Updated: 30 Nov 2021 09:05 PM
తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి సిరివెన్నెల : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ 

నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరన్న వార్త కలిచివేసిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సాహితీ విరించి సీతారామశాస్త్రికి శ్రద్ధాంజలి ఘటించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ. సీతారామశాస్త్రి మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు : పవన్ కల్యాణ్

సీతారామశాస్త్రి మరణం కేవలం సినీ పరిశ్రమకే కాదు తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సిరివెన్నెలను కేవలం సినీ గీత రచయితగా చూడలేమని, ఆయన ఏ పాట రాసినా అందులో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుందన్నారు. సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. 





సిరివెన్నెల మృతిపై ప్రధాని మోదీ సంతాపం 

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తనను బాధించిందన్నారు. ఆయన రచనలలో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ ఉంటుందన్నారు. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు ప్రధాని మోదీ సంతాపాన్ని తెలియజేశారు. 





సీతారామశాస్త్రి మృతి పట్ల మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి

సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటి రాగాల ఆ కోయిలమ్మకు నల్లటి రంగు ఏమిటి అంటూ ప్రశ్నించిన ఆ స్వరం ఇంత త్వరగా శాశ్వతనిద్రలోకి జారుకుంటుందని ఊహించలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన మరణం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు.

సీతారామశాస్త్రి స్వరాలకు బాలు కంఠ స్వరానికి అవినాభావ సంబంధం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. "తెలుగు సినీ జగత్తులో... సిరి వెన్నెల లా వెలిగిన సీతారామశాస్త్రి కలం ఎన్నో అద్భుతమైన పాటలు జాలు వార్చింది. ఆయన భావం, మాట, పాట ప్రజల్లోకి బాగా వెళ్లింది. ప్రేమ ఒలక బోసినా, జీవిత సత్యాలను నిష్టూరంగా చెప్పినా... భావం ఏదైనా, పాట ఏదైనా.. అందులో సీతారామ శాస్త్రి ముద్ర బలంగా ఉంది. వారి మరణం సినీ లోకానికి తీరని లోటు. సీతారామశాస్త్రి స్వరాలకు బాలు కంఠ స్వరానికి అవినాభావ సంబంధం ఉంది. అందుకే బాలు లేని లోకంలో నేను రాయలేను అంటూ... బాలు వద్దకే వెళ్ళిపోయారు. సీతారామ శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియచేస్తున్నాను." అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు.

రేపు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కు సిరివెన్నెల పార్థివదేహం

సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని రేపు ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు. ఈ రోజు కిమ్స్ ఆసుపత్రిలోనే సిరివెన్నెల మృతదేహం ఉంచనున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 

తెలుగు వారి గొప్పతనాన్ని చాటిచెప్పిన వ్యక్తి సిరివెన్నెల : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రముఖ కవి సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 'సిరివెన్నెల సినిమా తన ఇంటి పేరుగా మార్చింది. సిరివెన్నెల లోని పాటలు తెలుగు సినిమా చరిత్రలో తెలుగు ప్రజలకు గుర్తుండిపోయే పాటలు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన గేయాల ద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి గొప్పతనాన్ని చాటిచెప్పిన వ్యక్తి. 1997లో బీజేపీ జాతీయ యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు వారికి జాతీయస్థాయిలో యువ మోర్చా ఆధ్వర్యంలో యువ కళాకారుడిగా అవార్డును అటల్ బిహారీ వాజ్ పేయి అందించారు.' అని కిషన్ రెడ్డి అన్నారు.  






సిరివెన్నెల మృతిపై ఎమ్మెల్సీ కవిత సంతాపం

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం తెలిపారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. 





తెలుగు భాషకు పట్టం కట్టిన వ్యక్తి సిరివెన్నెల : ఉపరాష్ట్రపతి వెంకయ్య

తెలుగు సినిమా గేయ రచయిత చేంబోలు సీతారామశాస్త్రి మృతి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ఆయన పరమపదించారని తెలిసి ఎంతో విచారించానన్నారు. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని  తెలుగు భాషకు పట్టం కడుతూ సిరివెన్నెల రాసిన పాటలను అభిమానించే వారిలో తాను ఒకణ్ని అన్నారు. 





సిరివెన్నెల మరణం రాష్ట్ర ప్రజలకు, సినీ పరిశ్రమకు తీరని లోటు : బండి సంజయ్

ప్రముఖ సినీ గేయ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) మరణంపట్ల తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సీతారామశాస్త్రి మరణం రాష్ట్ర ప్రజలకు, సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'దాదాపు 3 వేల పాటలు రచించిన సీతారామశాస్త్రి ఉత్తమ పాటల రచయితగా 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించిన గొప్ప రచయిత. తెల్లారి లెగండోయ్.... నిగ్గదీసి అడుగు...ఇంటి పేరు కాదుర గాంధీ, ఆదిభిక్షువు వాడిని ఏది అడిగేది...అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని...తరలిరాద తనే వసంతం...ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్లు... అంటూ ఆయన రాసిన ఎన్నో పాటలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సీతారామశాస్త్రి రాసిన ప్రతి పాట ప్రజల మనసును దోచుకునేలా ఉండటం విశేషం.  సీతారామశాస్త్రి మన మధ్య భౌతికంగా లేకపోయినా పాటల రూపంలో చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారు.' అని బండి సంజయ్ అన్నారు. 

సిరివెన్నెల మృతిపై సీఎం జగన్ సంతాపం

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై సీఎం జగన్ సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల ఒక శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటు అన్నారు. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు.

Background

పాటలు రాసిన తొలి సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి. ఆయన్ను గేయ రచయిత అనడం కంటే కవి అనడం సబబు. సినిమా పాటకు పేరు తీసుకొచ్చిన కవి ఆయన. ఎన్నో వేల పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఆయన ఇకలేరు.


 


'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ఈ లోకాన్ని విడిచి పైలోకాలకు వెళ్లిపోయారు. ఈ రోజు (నవంబర్ 30, 2021) కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ నెల 22న ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. మధ్యలో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే... కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో లేరని చెప్పారు. మళ్లీ సోమవారం 'సిరివెన్నెల' పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఒక్క రోజు గడిచిందో... లేదో... ఆయన లేరనే వార్త వినాల్సి వచ్చింది.


 


'సిరివెన్నెల' సీతారామశాస్త్రి అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. చేంబోలు ఆయన ఇంటి పేరు. ఆయన జన్మించినది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివనిలో జన్మించారు. చేంబోలు వేంకట యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు ఆయన తొలి సంతానం. అక్కడ నుంచి స్వస్థలమైన విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లికి వేంకట యోగి వచ్చారు. 'సిరివెన్నెల' బాల్యం అంతా అక్కడే గడిచింది. హైస్కూల్ వరకూ అనకాపల్లిలో చదువుకున్నారు. తర్వాత 1971లో కాకినాడలోని ఆదర్శ్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. 1973లో పీఆర్ కాలేజీలో బీకామ్ చేరారు. అదే ఏడాది ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు. ఒక్క ఏడాది చదివారో... లేదో.. ఆయనకు 1974 సెప్టెంబర్ నెలలో టెలికాం శాఖలో అసిస్టెంటుగా ఉద్యోగం లభించింది. రాజమండ్రిలో 1974లో... తాడేపల్లి గూడెంలో 1975లో పని చేశారు. ఆ తర్వాత కాకినాడకు ట్రాన్సఫర్ అయ్యింది. 1983 వరకూ అక్కడే పని చేశారు. ఆ కాలంలోనే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. తర్వాత ఎంఏ జాయిన్ అయ్యారు. కానీ, ఓ ఏడాది తర్వాత చదువు ముగించారు.



కాకినాడలో పని చేస్తున్న సమయంలో సాహితీలోకంతో పరిచయమైంది. 'భరణి' అనే పేరుతో ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, విజయ తదితర పత్రికలకు కథలు, కవితలు పంపించారు. సుమారు ఓ పదిహేను కథల వరకూ రాశారు. ఆ తర్వాత ఆయనలో ప్రతిభను గుర్తించిన కళాతపస్వి కె. విశ్వనాథ్... 'సిరివెన్నెల' సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అదే ఆయన ఇంటి పేరు అయ్యింది. అక్కడ నుంచి తెలుగు సినిమాలో 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ప్రయాణం ఓ చరిత్ర అయ్యింది. ఎన్నో సినిమాల్లో పాటలకు ప్రాణం పోసిన ఆ కలం నేడు శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.