హైదరాబాద్: వచ్చే సీజన్ వేసవికాలం కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే 3 నెలలు అత్యంత కీలకమని, తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో సాగునీరు, తాగు నీరుతో పాటు విద్యుత్తు అవసరాలు భారీగా పెరుగుతాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అధికారులు ఈ మూడు విషయాలపై తగిన చర్యలు తీసుకుని, ప్రజలకు తాగునీరుతో పాటు రైతులకు సాగునీరు, విద్యుత్ సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
Telangana CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల ద్వారా సాగవుతున్న పంటలకు ఎప్పటికప్పుడూ సాగు నీటిని ప్లాన్ ప్రకారం విడుదల చేయాలన్నారు. సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, పరిస్థితులకు అనుగుణంగా పరిష్కార మార్గాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
రాబోయే మూడు నెలలు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపి.. ప్రజలకు ఇబ్బంది లేకుండా సాగు, తాగునీరు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, వారికి ఎప్పటికప్పుడూ తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆయన ఆదేశించారు. నాగార్జునసాగర్, శ్రీరామసాగర్ ప్రాజెక్టుల కింద సాగయ్యే పంటలు వివరాలు, నీటి విడుదలపై కలెక్టర్లు, నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో ఎప్పటికప్పుడూ సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు జరుగుతున్న సాగునీటి విడుదలను ఆయా జిల్లాల కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలని సూచించారు.
నిర్ణీత కోటా కంటే ఏపీకి ఎక్కువ ఇవ్వొద్దు
కృష్ణా జలాల విషయంలో నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల జలాలను నిర్ణీత కోటా కంటే ఎక్కువ నీటిని ఏపీకి తరలించకుండా చూడాలన్నారు. వీటిని అరికట్టేందుకు కృష్ణా పరీవాహకంలో టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటతో సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. కానీ ఆ పరికరాల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో వారి వాటా నిధులను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు రావటం లేదని సీఎంకు అధికారులు తెలిపారు.