Hyderabad Latest News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ అన్ని రకాలు విస్తరిస్తోంది. ఇప్పటికే ఇళ్లు, ఖాళీ స్థలాల అమ్మకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేటైంలో రియల్ ఎస్టేట్‌ను శివారు ప్రాంతాలకు విస్తరించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫార్మ్‌ లాండ్ పేరుతో అమ్మకాలు జోరు పెంచారు. ఫార్మ్‌ ల్యాండ్ కొంటే వీకెండ్‌లో వెళ్లి వ్యవసాయం చేసుకోవచ్చని...లేదా సేద తీరేందుకు ఉపయోగపడతాయని, భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడతాయని అంటగడుతున్నారు. 

Also Read: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో జరుగుతున్న ఫార్మ్‌ ప్లాట్ల అమ్మకాలపై హైడ్రా దృష్టి పెట్టింది. గతేడాది అమలులోకి తీసుకొచ్చిన ప్రజావాణి ఫిర్యాదుల నమోదు విభాగానికి భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందులో ఎక్కువ ఈ శివారు ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్న ఫార్మ్‌ ల్యాండ్‌పైనే ఉన్నాయని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. 

హైదరాబాద్‌ శివార్లలో ఫార్మ్ ప్లాట్లు కొనే ముందు ఆలోచించుకోవాలని ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి మోసాల బుట్టలో పడొద్దని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రన‌గ‌ర్ మండ‌లంలోని ల‌క్ష్మిగూడ గ్రామంలో భారీగా అమ్మకాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయన్నారు.  చట్ట ప్రకారం ఫార్మ్‌ ప్లాట్లు అమ్మడానికి లేదని హెచ్చరించారు. 

తెలంగాణ మున్సిప‌ల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయ‌త్ రాజ్ యాక్ట్ 2018 ప్రకారం ఫార్మ్ ప్లాట్లు అమ్మడానికి, కొనడానికి లేదని రంగనాథ్ స్పష్టం చేసారు. 2 వేల చ‌ద‌ర‌పు మీట‌ర్లు, లేదా 20 గుంట‌ల స్థలం ఉంటేనే ఫార్మ్ ల్యాండ్ అంటారని ప్రభుత్వ చెబుతోందని అన్నారు. అలాంటి వాటినే రిజిస్ట్రేషన్ చేయాలని అలా కాకుంటే రిజిస్ట్రేషన్ చేయొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  

31.8.2020న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 131 వ జీవో ప్రకారం అనాథ‌రైజ్డ్ లే ఔట్లలో వేసిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ రూల్స్ పాటించడం లేదని పార్కులు, రోడ్ల కోసం స్థలం కేటాయించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. ఇలాంటి కొంటే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వాధికారులు బాధ్యులు కారని హెచ్చరించారు. అలాంటి భూముల కొనుగోలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Also Read: ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల- కటాఫ్ ఎంత ఉండొచ్చు!