Andhra Pradesh And Telangana Latest News: ప్రభుత్వం అనేది ఒక యంత్రం అయితే దాన్ని నడిపే ఇంధనం అధికారులు. సీఎంలు, మంత్రుల స్థాయిలో తీసుకునే నిర్ణయం ఏదైనా క్షేత్రస్థాయిలో అమలు కావాలంటే ఆ కార్యనిర్వహణ అంతా అధికారుల చేతుల్లోనే ఉంటుంది. అయితే వాళ్లతో ఆ పనులు చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలదే. కానీ ప్రస్తుతం ప్రభుత్వానికి అధికారులకు మధ్య ఎక్కడో చిన్న సమన్వయ లోపం ఉన్నట్టు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడం విచిత్రంగా ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏకంగా సీఎంల స్థాయిలోనే అధికారులపై విమర్శలు వెలువడ్డం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయింది.  


అధికారులు ఏసీల కలవాటు పడిపోయారు : సీఎం రేవంత్ 
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారుల గురించి మాట్లాడుతూ ' IAS, IPSలు కూడా ఏసీ గదులకు అలవాటు పడిపోయారని ఫీల్డ్ విజిట్ అనేది పక్కన పెట్టేసారు'అంటూ కామెంట్స్ చేశారు. IASలు ఒక్కసారి సెక్రటేరియెట్‌కు అలవాటు పడ్డాక ఫీల్డ్‌లో తిరగడం లేదనేది ఆయన అభిప్రాయం. ఐపీఎస్‌లో కూడా ట్రైనింగ్ పూర్తయ్యాక కిందిస్థాయి నుంచి పనిచేసే అనుభవాలు తెలుసుకునే వారనీ ఇప్పుడు ఆ పద్ధతి ఏమైపోయింది అంటూ విచారం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిపై పట్టు ఉంటేనే పరిపాలనపై అవగాహన ఉంటుందని ఆయన అభిప్రాయం. ఇటీవల ప్రభుత్వ పాలనలో సమన్వయ లోపం ఉంటుందంటూ వస్తున్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనితో నిజంగానే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాల అమల్లో ఎక్కడో కోఆర్డినేషన్ మిస్ అవుతుందన్న విమర్శలకు ఆధారం లభించినట్టు అయింది 


ఇంకా జగన్ పాలనలోనే ఉన్నామనుకుంటున్నారా: సీఎం చంద్రబాబు 
ఏపీలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఉద్దేశించి " మీరు ఇంకా పాత పాలనలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. పద్ధతి మారాలి. తనతోపాటు పరుగులు పెట్టాలంటూ " పదే పదే చెబుతున్నారు. అంతేకాకుండా తాను "94నాటి చంద్రబాబును అనీ పరిపాలనలో తన వేగాన్ని అందుకోవాలని" సీరియస్ గానే అధికారులకు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అయితే పోలీసులును ఉద్దేశించి "చంద్రబాబును అరెస్ట్ చేయడానికి అయితే వెంటనే కదులుతారని మిగిలిన విషయాల్లో కాస్త నెమ్మదిగా ఉంటున్నారు అంటూ" నవ్వుతూనే సెటైర్లు వేశారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటుతున్న తర్వాత కూడా అధికారులపై ఇలా విమర్శలు చేయడం తగదని ప్రభుత్వం మీదైనప్పుడు అధికారులపై పట్టు సాధించకపోవడం ప్రభుత్వ పెద్దల అలసత్వం అని ఒక వెర్షన్ వినపడుతుండగా మరోవైపు అధికారులు కూటమికి సహకరించటం లేదన్న వాదన మరోవైపు నుంచి వినిపిస్తోంది.


Also Read: అగ్రనేతల కులాలు, మతాలతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం - బీఆర్ఎస్‌ను సైడ్ చేసే ప్లానేనా ?


ఇదే దారిలో పవన్ 
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించు ఇదే దారిలో ఉన్నారు. ఇంతకుముందు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బియ్యం స్మగ్లింగ్, పెట్రోల్ కల్తీ లాంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతుంటే స్వయంగా నాదెండ్ల మనోహర్ లాంటి మంత్రో లేక ఉపముఖ్యమంత్రి స్థాయిలో తానో వెళ్లి పట్టుకుంటున్నామని అధికారులు అప్రమత్తంగా ఉండాలని గట్టిగానే చెప్పారు. 


ఓవరాల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీఎంలకు, మంత్రులకు వారి ఆదేశానుసారం పనిచేసే అధికారులకు మధ్య ఎక్కడో సమన్వయ లోపం ఉందన్నది మాత్రం స్పష్టం అంటూ ఈ పరిణామాలతో తెలుస్తుందన్నది ఎనలిస్టుల మాట.


Also Read: సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?