SBI Mutual Fund Rs 250 JanNivesh SIP: ఇప్పుడు, కేవలం రూ.250తో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (AMC) SBI మ్యూచువల్ ఫండ్, నెలవారీ పెట్టుబడి రూ.250తో SIP (Systematic Investment Plan) ప్రారంభించింది. సమాజంలోని పేద వర్గాలకు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులకు కూడా పెట్టుబడి అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యం. జన్‌నివేశ్ సిప్ (SBI JanNivesh SIP) పథకం కింద, పెట్టుబడిదారులు SIP ద్వారా ప్రతి నెలా కనీసం రూ.250 పెట్టుబడి పెట్టగలరు.
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) చైర్‌పర్సన్ మాధవి పురి బచ్ ఈ కొత్త ఆర్థిక ఉత్పత్తిని ప్రారంభించారు. సాధారణంగా పెట్టుబడిదారులు SIPలో రూ.500 పెట్టుబడి పెడతారు. కొన్ని పథకాల్లో SIP మొత్తం రూ.100 కూడా ఉన్నప్పటికీ, ఆ పథకాలు చాలా పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని & SIP ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, రూ.500 చెల్లించే పరిస్థితి లేక చాలా మంది ఆగిపోతున్నారు. ఈ అడ్డంకిని అధిగమించడానికి, మ్యూచువల్ ఫండ్ల పరిధిని విస్తృతం చేయడానికి, అన్ని వర్గాలకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ రూ.250 చిన్న పెట్టుబడితో SIP ప్రారంభించింది.
రూ.250 రూపాయల పెట్టుబడితో SIP ప్రారంభించడం తన "చిరకాల స్వప్నాల్లో ఒకటి"గా సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురి బచ్ చెప్పారు. "ఇప్పుడు ఎక్కువ మంది ఆర్థిక పథకాల్లో భాగస్వాములు అవుతారు. సంపద సృష్టి జరిగిన అది అందరికీ పంపిణీ అవుతుంది. నా వరకు దీనిని క్రౌడ్ ఫండింగ్ అంటాను" అని అన్నారు.
చాలా యాప్స్‌లో అందుబాటులోకి...
రూ.250 జన్‌నివేశ్ సిప్ ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్‌తో పాటు పేటీఎం (Paytm), జీరోధ (Zerodha), గో (Groww) ఫ్లాట్‌ఫామ్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. గ్రామాలు, పట్టణాల్లోని చిన్న పొదుపుదారులు, తొలిసారి పెట్టుబడి పెట్టేవాళ్లు, అసంఘటిత కార్మికులు, మహిళలు, విద్యార్థులకు అనువుగా దీనిని రూపొందించారు.
పాన్ కార్డ్ లేకపోయినా...
పాన్ కార్డ్ (PAN Card) లేకపోయినా SBI జన్‌నివేశ్ సిప్ ప్రారంభించవచ్చు. ఎస్‌బీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ (SBI Balanced Advantage Fund)లో ఈ రూ.250 SIP స్టార్ట్ చేయవచ్చు. ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి లేదా నెలవారీగా SIP చేయవచ్చు.
ఛార్జీలు రద్దు
SBI జన్‌నివేశ్ సిప్‌ను ప్రోత్సహించేందుకు, ఈ లావాదేలపై టాన్జాక్షన్ ఛార్జీలను స్టేట్ బ్యాంక్ రద్దు చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: కొత్త ఆదాయ పన్ను బిల్లులో ELSS ప్రయోజనం ఉంటుందా? - టాక్స్‌పేయర్లు ఇది తెలుసుకోవాలి