Return on Tax Saving Scheme ELSS: టాక్స్‌పేయర్లకు బాగా పరిచయమైన పదం ఈఎల్‌ఎస్‌ఎస్. ELSS అంటే "ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్" (Equity Linked Savings Scheme). రూల్స్ ప్రకారం, ELSSలో జమ చేసిన మొత్తం డబ్బులో 80 శాతాన్ని స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. మార్కెట్ ఒడుదొడుకుల ఆధారంగా పెట్టుబడిదార్లకు రాబడి వస్తుంటుంది.
ELSS నుంచి మంచి రాబడి
ఒక విధంగా చూస్తే, 'ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్' అనేది మ్యూచువల్ ఫండ్ లాంటిది. ఇటీవలి సంవత్సరాలలో, ఈ పథకం తన పెట్టుబడిదారులకు 14.56 శాతం వరకు వార్షిక రాబడిని ఇచ్చింది. దీనిని మంచి రాబడిగా పరిగణించవచ్చు. అంతేకాదు, దీని లాక్-ఇన్ వ్యవధి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే. ఇతర టాక్స్ సేవింగ్ స్కీమ్‌లతో పోలిస్తే ఇది చాలా తక్కువ వ్యవధి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని మూడేళ్ల తర్వాత వెనక్కు తీసుకోవచ్చు. మంచి రాబడితో పాటు పన్ను ప్రయోజనం, తక్కువ లాక్-ఇన్ వ్యవధి కారణంగా ఈ స్కీమ్ పాపులర్ అయింది, ముఖ్యంగా శాలరీ తీసుకునే టాక్స్‌పేయర్లకు ఇష్టసఖిగా మారింది.
పన్ను ఆదా చేయాలనుకునే టాక్స్‌పేయర్లు ELSSలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద (Under Section 80C of the Income Tax Act), ఒక ఆర్థిక సంవత్సరంలో ELSSలో జమ చేసిన రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు పొందుతారు. అయితే, ఈ నిబంధనను కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025 (Income Tax Bill 2025)లో రద్దు చేశారు. ఎందుకంటే, కొత్త బిల్లు ప్రకారం, కొత్త పన్ను విధానాన్ని (New Tax Regime) డిఫాల్ట్ పన్ను వ్యవస్థగా పిలుస్తారు & దానిలో అలాంటి మినహాయింపులకు అనుమతి ఉండదు. అయితే, కంగారు పడాల్సిన అవసరం లేదు. కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాత పన్ను విధానం (Old Tax Regime) ఉంటుంది. పాత పన్ను విధానం ప్రకారం ELSS ప్రయోజనాలు కొనసాగుతాయి.
మరో ఆసక్తికర కథనం: రూ.87,000 పైనే పసిడి ప్రకాశం - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
సెక్షన్ 123 కిందకు సెక్షన్ 80C ప్రయోజనాలు
కొత్త ఆదాయ పన్ను బిల్లులో సెక్షన్ 80C ప్రయోజనాలు రద్దు అయ్యాయి. కానీ, అవే ప్రయోజనాలు సెక్షన్ 123 కిందకు మారాయి. ELSS నుంచి పన్ను ప్రయోజనాలను పొందడానికి, మీరు పాత పన్ను విధానాన్ని అనుసరించాలి. కొత్త ఆదాయ పన్ను బిల్లులోని సెక్షన్ 123 ప్రకారం, ఒక వ్యక్తి లేదా హిందు అవిభక్త కుటుంబం (HUF) ఒక పన్ను సంవత్సరం (Tax Year)లో చెల్లించిన లేదా జమ చేసిన మొత్తంపై మినహాయింపులకు అర్హులు అవుతారు. రూ. 1.50 లక్షలకు మించకుండా ఈ మినహాయింపును పొందవచ్చు.
మరో ఆసక్తికర కథనం: బ్లాక్ లిస్ట్ నుంచి బయటకురాకపోతే 'డబుల్ ఫీజ్' - టోల్‌గేట్ల దగ్గర ఈ రోజు నుంచి కొత్త రూల్స్