Tollgate Charge New Rules: వాహన యజమానుల బద్ధకాన్ని వదిలించేలా ఫాస్టాగ్ రూల్స్ మారాయి. హైవేల మీద టోల్ వసూళ్ల కోసం 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI)తో కలిసి పని చేస్తున్న కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ.. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడానికి, మోసాలను అరికట్టడానికి, వివాదాలను తగ్గించడానికి ఫాస్టాగ్ (FASTag) నియమాల్లో కీలక మార్పులు చేసింది. కొత్త నియమాల ఈ రోజు (సోమవారం, 17 ఫిబ్రవరి 2025) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రూల్స్ తెలీకుండా రోడ్డెక్కితే మోత మోగిపోద్ది.
ఫాస్టాగ్ నియమాలకు సంబంధించిన సర్క్యులర్‌ను 2025 జనవరి 28నే జారీ చేశారు. కొత్త రూల్స్ ప్రకారం, ఈ రోజు నుంచి, ఫాస్టాగ్‌లో తక్కువ బ్యాలెన్స్, చెల్లింపులు ఆలస్యం కావడం లేదా బ్లాక్‌లిస్ట్ ట్యాగ్ ఉన్న యూజర్లపై అదనపు జరిమానా విధిస్తారు.
కొత్త ఫాస్టాగ్ నియమాలు
తగిన బ్యాలెన్స్ లేని ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళుతుంది. ఒక వాహనం టోల్ ప్లాజాను చేరడానికి ముందు, ఆ ఫాస్టాగ్ 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, "ఎర్రర్ కోడ్ 176" (Error Code 176)ను చూపి లావాదేవీని తిరస్కరిస్తారు. టోల్ ప్లాజా వద్ద స్కాన్ చేసిన 10 నిమిషాల వరకు నిష్క్రియంగా (ఇన్‌యాక్టివ్) ఉన్నా కూడా “ఎర్రర్ కోడ్ 176”తో ఆ లావాదేవీని తిరస్కరిస్తారు. ఇలాంటి సందర్భంలో పెనాల్టీ కింద "డబుల్ టోల్ ఫీజ్" వసూలు చేస్తారు.
తక్కువ బ్యాలెన్స్ విషయంలో మాత్రమే కాదు... KYC వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం, ఛాసిస్ నంబర్ - వాహనం నంబర్ సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళుతుంది. కాబట్టి, ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్లకుండా చూసుకోవడం మీ జేబుకు మంచిది. ఎప్పటికప్పుడు ఫాస్టాగ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవాలి. ఈ రూల్, ఫాస్టాగ్‌ను చివరి నిమిషంలో రీఛార్జ్ చేసే వ్యక్తుల బద్ధకాన్ని వదలగొడుతుంది.
అదనంగా, టోల్ చెల్లింపు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు వివాదాలను తగ్గించడానికి ఛార్జ్‌బ్యాక్ ప్రక్రియ, శీతలీకరణ వ్యవధి మరియు లావాదేవీ తిరస్కరణ నియమాలలో మార్పులు ప్రవేశపెట్టబడుతున్నాయి.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఫాస్టాగ్ వినియోగదారులు తమ వాహనం టోల్ రీడర్‌ను దాటిన 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం తర్వాత వారి టోల్ లావాదేవీలను ప్రాసెస్ చేస్తే అదనపు ఛార్జీలను ఎదుర్కోవలసి ఉంటుంది.
గతంలో, వినియోగదారులు టోల్ బూత్ దగ్గర తమ ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకుని ముందుకు వెళ్లిపోవచ్చు. ఇప్పుడు, అంత టైమ్ ఉండదు కాబట్టి, బండి టోల్ గేట్ దగ్గరకు రావడానికి ముందే తమ FASTag బ్యాలెన్స్‌ను తప్పనిసరిగా చూసుకోవాలి.
NPCI డేటా ప్రకారం, ఫాస్టాగ్ లావాదేవీలు 2024 డిసెంబర్‌లో 6 శాతం పెరిగాయి. 2024 నవంబర్‌లోని 359 మిలియన్లతో పోలిస్తే డిసెంబర్‌లో 382 మిలియన్లకు చేరుకున్నాయి. లావాదేవీ విలువ కూడా 9 శాతం పెరిగింది, డిసెంబర్‌లో మొత్తం రూ. 6,642 కోట్లు వసూలయ్యాయి, నవంబర్‌లో ఈ మొత్తం రూ.6,070 కోట్లుగా ఉంది.
మరో ఆసక్తికర కథనం: రిజర్వ్ బ్యాంక్ రూ.40,000 కోట్లు ఇస్తుంది, ఖర్చు చేయడానికి రెడీగా ఉండండి