Enhancing Liquidity in The Indian Economy: భయపెడుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు డబ్బు పెద్దగా ఖర్చు చేయకపోవడంతో వినియోగ మార్కెట్ మందకొడిగా మారింది. అమ్మకాలు తగ్గిపోయి చిన్న & పెద్ద కంపెనీలు ఈగలు తోలుకుంటున్న పరిస్థితి ఉంది, ఇటీవలి కార్పొరేట్ రిజల్ట్స్ ఈ విషయాన్ని స్పష్టంగా చూపించాయి. ఓవరాల్‌గా ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో దైన్యానికి ముఖచిత్రంగా మారింది. భారత ఆర్థిక వృద్ధిలో మళ్లీ బలం చూడాలంటే ఉన్న ఒకే ఒక్క మర్గం జనం చేత విరివిగా ఖర్చు చేయించడం. దీనికోసం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ప్లాన్ రూపొందించింది, ఆ ప్లాన్‌ను దశలవారీగా అమలు చేస్తోంది. ప్లాన్‌లో భాగంగా, వచ్చే వారం, RBI మరో రూ. 40,000 కోట్ల నగదు ప్రవాహానికి (Cash flow) గేట్లు ఎత్తేస్తుంది. ఈ నగదు ప్రవాహం బ్యాంకుల ద్వారా జనావాసాల్లోకి (జనం జేబుల్లోకి) వస్తుంది.
వచ్చే వారం, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీలను కొనుగోలు చేయడం (Purchase of Central and State Government Securities) ద్వారా, రిజర్వ్ బ్యాంక్ రూ. 40 వేల కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఈ డబ్బు మొత్తం వివిధ రకాల లోన్‌ల రూపంలో సాధారణ ప్రజలకు, వ్యాపారవేత్తలకు అందుతుంది.
కొనసాగుతున్న ద్రవ్యత సంక్షోభం
బ్యాంక్‌లో డబ్బు ఉంటే.. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకు లేదా సాధారణ ప్రజలకు ఆ డబ్బును అందించడంలో బ్యాంకులు ఎలాంటి ఆలస్యం చేయవు. అందువల్ల, ప్రజల చేతుల్లోకి, ముఖ్యంగా మధ్య తరగతి జనం జేబుల్లోకి డబ్బు చేరుతుంది. జేబులో డబ్బుంటే జనం మొహమాటం లేకుండా ఖర్చు చేస్తారు. వాస్తవానికి, ఆర్థిక వ్యవస్థలోకి రూ. 20,000 కోట్లు చొప్పించాలని మాత్రమే రిజర్వ్ బ్యాంక్ తొలుత నిర్ణయించింది. కానీ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి, రూ. 40,000 కోట్లకు పెంచింది.
ప్రజల నుంచి వినియోగం (CONSUMPTION) పెరగడం వల్ల, మార్కెట్‌లో వివిధ వస్తువులకు మళ్లీ డిమాండ్ పెరుగుంది. కంపెనీలు వినియోగ వస్తువుల ఉత్పత్తిని పెంచుతాయి, వాటి అమ్మకాలు పెరుగుతాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో మళ్లీ వేగం చూడగలం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో చేసిన వివిధ రకాల కేటాయింపులు, రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుంచి బయటకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు. గత ఎనిమిది వారాలుగా భారత మార్కెట్లో ద్రవ్యత సంక్షోభం (Liquidity Crisis) కొనసాగుతోంది. ఫిబ్రవరి 07న అది రూ. 1.33 లక్షల కోట్లకు చేరుకుంది.
ఇటీవల రెపో రేటు తగ్గించిన ఆర్‌బీఐ
ఇటీవల, రెపో రేటు (Repo Rate)ను 25 పాయింట్లు తగ్గించిన కేంద్ర బ్యాంక్, ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెంచే చర్యలు కూడా ప్రకటించింది. దేశ పరిస్థితుల పట్ల కేంద్ర బ్యాంకు అప్రమత్తంగా ఉందని, ద్రవ్యతను కొనసాగించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఇప్పటివరకు, RBI బాండ్లను కొనుగోలు చేయడం & డాలర్/రూపాయి స్వాప్‌ల ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి రూ.1 లక్ష కోట్లకు పైగా చొప్పించింది. 56 డేస్ రెపో ఆక్షన్ ద్వారా మరో రూ.50,000 కోట్లు ఇంజెక్ట్ చేసింది.
మరో ఆసక్తికర కథనం: 50 శాతం డిస్కౌంట్‌లో వస్తున్న నవతరం కంపెనీల షేర్లు - ఇప్పుడు కొంటే ఏం జరుగుతుంది?