New-Age Tech And Startup Companies Stocks: గత వారం భారత స్టాక్ మార్కెట్ భారీ విక్రయాలను (Huge selloff in Indian stock market) చూసింది. అమ్మకాల తుపాను ధాటికి న్యూ-ఏజ్ టెక్ కంపెనీలు & స్టార్టప్ కంపెనీల షేర్లు విలవిల్లాడాయి. ఈ కంపెనీల స్టాక్స్ గత వారంలో 23 శాతం వరకు జారిపోయాయి. వాటి ఆల్-టైమ్ హై నుంచి చూస్తే, ఇప్పుడు, దాదాపు 50 శాతం వరకు పడిపోయాయి. అంటే, ఆల్-టైమ్ హై నుంచి దాదాపు 50 శాతం డిస్కౌంట్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి.


ఫిన్‌టెక్ షేర్లకు ఎక్కువ నష్టం
నవతరం (New-Age) టెక్ కంపెనీలలో, ముఖ్యంగా ఫిన్‌టెక్ కంపెనీ షేర్లు అతి పెద్ద క్షీణతను భరించాయి. గత వారం... ఫినో పేమెంట్స్ బ్యాంక్ షేర్లు 22.66 శాతం తగ్గి రూ. 226.10 వద్ద ముగిశాయి. విఫిన్‌ సొల్యూషన్స్ షేర్లు 22.92 శాతం క్షీణించి రూ. 402.35 వద్ద క్లోజ్‌ అయ్యాయి. శుక్రవారం పేటీఎం షేర్లు 9.79 శాతం క్షీణించి రూ. 719.90 వద్ద ముగిశాయి. ఈ-కామర్స్ కంపెనీ యూనికామర్స్ ఈసొల్యూషన్స్ షేర్లు గత వారంలో 20.98 శాతం తగ్గి రూ. 118 వద్ద ఆగాయి. అదే సమయంలో, జాగల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ స్టాక్ 18 శాతానికి పైగా తగ్గి రూ. 347.15 వద్ద సెటిల్‌ అయింది.


ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగిన ట్రేడింగ్ సెషన్లలో.. ఫుడ్ డెలివరీ కంపెనీలు స్విగ్గీ & జొమాటో షేర్లు వరుసగా 5.41 శాతం, 6.36 శాతం క్షీణించి రూ. 341.60 & రూ. 216.44 వద్ద ముగిశాయి. గత వారంలో, ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 13 శాతం తగ్గి రూ. 60.87 వద్ద ముగిశాయి.


ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ల పరిస్థితి ఇదీ..
గత వారంలో, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSE నిఫ్టీ 2.8 శాతం పడిపోయింది. ఈ సంవత్సరంలో, వారంవారీ క్షీణత పరంగా ఇదో చెత్త రికార్డ్‌. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఆ వారంలో 9 శాతానికి పైగా పడిపోయి సైలైంట్‌ అయింది. అదే సమయంలో, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 6 శాతం క్షీణించింది. 


గత వారం, నిఫ్టీ మిడ్‌ క్యాప్ 150 ఇండెక్స్ కరోనా తర్వాత మొదటిసారిగా అతి పెద్ద క్షీణతను చవిచూసింది. అదే వారంలో నిఫ్టీ స్మాల్‌ క్యాప్ 250 ఇండెక్స్ 9.5 శాతం పడిపోయింది, ఇది కూడా కోవిడ్-19 తర్వాత ఇప్పటి వరకు వచ్చిన అతి పెద్ద లాస్‌. లాస్ట్‌ వీక్‌లో 


BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్ వరుసగా 2.59 శాతం & 3.24 శాతం తగ్గాయి.


ఇప్పుడు కొనవచ్చా?
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, మార్కెట్‌లో సెల్లింగ్‌ ఫీవర్‌ ఇప్పట్లో తగ్గే సూచనలు లేవన్నది ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయం. షేర్‌ ధరలు తగ్గినప్పుడు కొనడం మంచి ఆలోచనే అయినప్పటికీ, ప్రస్తుతం వాటి వాల్యుయేషన్లు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.


ఈ వారంలో తొలి రోజు, ఈ రోజు (సోమవారం, 17 ఫిబ్రవరి 2025) కూడా భారతీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఉదయం 10 గంటల సమయానికి, NSE నిఫ్టీ 163 పాయింట్లు లేదా 0.71% తగ్గి 22,766 దగ్గర ఉంది. అదే సమయానికి BSE సెన్సెక్స్ 558 పాయింట్లు లేదా 0.74% పడిపోయి 75,380 వద్ద కదులుతోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: స్టాక్‌ మార్కెట్‌లోకి రానున్న లెన్స్‌కార్ట్‌ - IPO టార్గెట్‌ దాదాపు రూ.8,700 కోట్లు