Gold Gives Better Returns Than Stock Markets: ప్రస్తుతం భారతీయ స్టాక్ మార్కెట్ నేలచూపులు చూస్తోంది, పెట్టుబడిదార్లను విపరీతంగా టెన్షన్ పెడుతోంది. గత శుక్రవారంతో కలిపి మార్కెట్ వరుసగా 8వ రోజు కూడా నష్టాల్లో ముగిసింది, ఈ మధ్యకాలంలో వరుసగా ఇన్ని రోజుల నష్టాలను ఎదుర్కోలేదు. అదే సమయంలో, బంగారం మెరుపులు కొనసాగుతున్నాయి, ఇన్వెస్టర్ల ముఖంలో నవ్వులు కూడా కంటిన్యూ అవుతున్నాయి. 2000 సంవత్సరం ప్రారంభం నుంచి, అంటే గత 25 సంవత్సరాలలో ప్రధాన స్టాక్ మార్కెట్లతో పోలిస్తే బంగారం మెరుగైన రాబడిని ఇచ్చింది, పెట్టుబడిదారుల పాలిట ఉత్తమ ఎంపికగా మారింది. నిఫ్టీ50, S&P 500 వంటి బెంచ్‌మార్క్ సూచీలతో పోలిస్తే, 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, బంగారం బలమైన రాబడిని ఇచ్చిందని అక్విటాస్ (Aequitas) రిపోర్ట్ వెల్లడించింది.
అమెరికన్ మార్కెట్ల కంటే కూడా బెటర్
ఇండియన్ స్టాక్ మార్కెట్లతోనే కాదు, అమెరికన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లతో పోల్చి చూసినా బంగారం బెటర్ ఇన్వెస్ట్‌మెంట్‌గా నిలిచింది. ఈ ప్రీసియస్ మెటల్ తన పెట్టుబడిదారులకు స్థిరంగా అధిక రాబడిని అందించిందని అక్విటాస్ రిపోర్ట్‌లో ఉంది. అంటే, 2000 సంవత్సరం నుంచి గత 25 సంవత్సరాలలో, బంగారం S&P 500, నిఫ్టీ 50 రెండింటినీ ఔట్‌పెర్ఫార్మ్ చేసింది.
బంగారం Vs నిఫ్టీ50, S&P 500
అమెరికన్ డాలర్ పరంగా చూస్తే... 2000 సంవత్సరం నుంచి బంగారం 9.99 రెట్లు పెరిగింది. అదే కాలంలో S&P 500 4.34 రెట్లు మాత్రమే వృద్ధిని సాధించింది. ఈ లెక్కన, గత పాతికేళ్లలో, పసుపు లోహం S&P 500 కంటే రెట్టింపు పైగా రాబడిని ఇచ్చింది. భారతీయ రూపాయి పరంగా కూడా బంగారం నిఫ్టీ50 సూచీ కంటే మెరుగ్గా ఉంది. ఈ 24 ఏళ్ల కాలంలో బంగారంపై రాబడి 19.32 రెట్లు పెరిగింది. అదే సమంయలో నిఫ్టీ50 ఇండెక్స్ 15.67 రెట్లు పెరిగింది.
సురక్షిత పెట్టుబడి మార్గం
ముఖ్యంగా అనిశ్చిత సమయాల్లో బంగారం విలువైన పెట్టుబడి మార్గంగా మారిందని అక్విటాస్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే యుద్ధాలు, కరవులు, ద్రవ్యోల్బణం వంటి సంఘటనలు సంభవించిన ప్రతిసారీ పెట్టుబడిదారులకు పసిడి అండ ఉంటోంది. అనిశ్చిత సమయాల్లో ఈక్విటీలు, క్యాష్, ట్రెజరీల వంటి వాటిలో పెట్టుబడుల విలువ పడిపోతుంటే, గోల్డ్ మాత్రం నేరుగా ముందడుగు వేస్తుంది & పెట్టుబడిదారుల నష్టాలను భర్తీ చేస్తుంది. అందుకే, ప్రపంచ పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన స్వర్గ ఆస్తి (safe haven asset)గా పరిగణిస్తారు.
బలహీనపడిన డాలర్ ఇండెక్స్, US టారిఫ్ విధానాల కారణంగా బంగారం ధరల్లో పెరుగుదల కొనసాగిందని LKP సెక్యూరిటీస్‌లో కమోడిటీ అండ్ కరెన్సీ VP రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది చెబుతున్నారు. భవిష్యత్‌లోనూ ఇది కొనసాగే అవకాశం ఉందన్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తిర కథనం: మీ కుమార్తె భవిష్యత్ కోసం ఒక తెలివైన నిర్ణయం - దాదాపు రూ.23 లక్షలు లబ్ధి!