Lenskart IPO News: ఆన్‌లైన్ నుంచి ఆఫ్‌లైన్ వరకు కళ్లజోళ్లు అమ్మే ఐవేర్ రిటైల్ కంపెనీ 'లెన్స్‌కార్ట్', స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు సిద్ధం అవుతోంది. దేశ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ఐవేర్ కంపెనీ, సమీప భవిష్యత్‌లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ప్రారంభించనుంది. IPO ద్వారా, ప్రైమరీ మార్కెట్ నుంచి 1 బిలియన్ డాలర్లను సేకరించడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత డాలర్-రూపాయి రేట్ ప్రకారం, 1 బిలియన్ డాలర్ల విలువను భారతీయ రూపాయల్లో చెప్పుకుంటే దాదాపు 8,700 కోట్ల రూపాయలు (రూ. 8669,82,36,400) అవుతుంది. IPO తీసుకురావడానికి ఈ సంవత్సరం మే నెలలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) వద్ద ముసాయిదా పత్రాలను (DRHP) దాఖలు చేయవచ్చు.
లెన్స్‌కార్ట్ IPO వాల్యుయేషన్ గురించి ఆ కంపెనీ CEO పియూష్ బన్సాల్ (Peyush Bansal) & కంపెనీలోని కీలక పెట్టుబడిదారులు ఇటీవలి వారాల్లో బ్యాంకర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ IPO ద్వారా లెన్స్‌కార్ట్ 10 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకుంది, IPO మార్కెట్ నుంచి అందులో పదో వంతును (1 బిలియన్ డాలర్లు) సేకరించనుంది. అయితే, మార్కెట్ పరిస్థితులు & సెంటిమెంట్‌ను బట్టి IPOను ప్రారంభించే తేదీలను నిర్ణయిస్తారు.
మే నెలలో IPO - ఈ ఏడాదిలో లిస్టింగ్!
నేషనల్ మీడియా రిపోర్ట్‌ల ప్రకారం, ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలోనే, ఈ కంపెనీ తన షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయాలని చూస్తోంది. దీని కంటే ముందు IPO ఓపెన్ చేయాలి కాబట్టి, ఈ ఏడాది మే నెల నాటికి SEBIకి IPO డ్రాఫ్ట్ పేపర్లను (DRHP) దాఖలు చేసేందుకు సిద్ధం అవుతోంది.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి చూస్తే, 10 బిలియన్ డాలర్ల విలువ లక్ష్యం పెద్దది & దూకుడుగా తీసుకునే నిర్ణయం అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కంపెనీలో ఉన్న పెట్టుబడిదార్లు ప్రయోజనం పొందాలంటే IPO విలువను తగ్గించాల్సి వస్తుందని సూచిస్తున్నారు.
లెన్స్‌కార్ట్ గురించి....
సాఫ్ట్ బ్యాంక్, టెమాసెక్ పెట్టుబడులు ఉన్న లెన్స్‌కార్ట్, మన దేశంలో ప్రముఖ కళ్లద్దాల సంస్థ. ఇది కళ్ళద్దాలు & కాంట్రాక్ట్ లెన్స్‌లను విక్రయిస్తుంది. ఈ కంపెనీకి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ విక్రయాలు చేస్తుంది, సెల్లింగ్ స్టోర్స్ ఉన్నాయి. ఈ కంపెనీని 2010లో పియూష్ బన్సాల్ ప్రారంభించారు, ఆయన ప్రస్తుతం CEOగా పని చేస్తున్నారు. భారతదేశంలో లెన్స్‌కార్ట్ కార్యకలాపాలు లాభదాయకంగా ఉన్నాయి & కంపెనీ నిరంతరం విస్తరిస్తోంది. 2022 సంవత్సరంలో జపనీస్ కంపెనీని 400 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ కంపెనీ థాయిలాండ్‌లో ఆశాజనకంగా పని చేస్తోంది. గత ఏడాది జూన్‌లో జరిగిన రెండో రౌండ్‌లో లెన్స్‌కార్ట్ 200 మిలియన్ డాలర్లను సేకరించింది. ఈ మొత్తాన్ని కంపెనీ 5 బిలియన్ల విలువ వద్ద సేకరించారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ లాభం ఇచ్చిన పెట్టుబడి ఇది - డబ్బుల వర్షంలో తడిసిన ఇన్వెస్టర్లు