Tiger Nageswara Rao: మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. గతేడాది ‘ధమాకా’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు రవితేజ. ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ ఏడాది కూడా అదే ఫామ్ ను కొనసాగిస్తున్నారు ఈ మాస్ హీరో. సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవికు తమ్ముడిగా పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ మూవీ కూడా మంచి వసూళ్లను సాధించింది. తాజాగా ‘రావణాసుర’ సినిమాను విడుదలకు సిద్దం చేశారు. ఈ మూవీ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టు చేస్తున్నారు రవితేజ. అదే ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమా గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా మూవీ గురించి క్రేజీ అప్డేట్ ను అందించారు మేకర్స్. ఏకంగా సినిమా విడుదల తేదీను ప్రకటించేశారు. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 


రవితేజ హీరోగా రూపొందుతున్న ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మహేశ్ ఈ మూవీకు దర్శకత్వం వహిస్తున్నారు. 1970-80 ల ప్రాంతంలో స్టువర్టుపురం గజదొంగగా పోలీసులకు నిద్రలేకుండా చేసిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఇది. అందుకే ఈ సినిమా కోసం ఆనాటి పరిస్థితులను చూపించడానికి ఏకంగా ఐదు ఎకరాల స్థలంలో స్టువర్టుపురం లొకేషన్స్ ను నిర్మించారట మేకర్స్. ఇందులో రవితేజ పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్, కాస్ట్యూమ్స్ అన్నీ సరికొత్తగా ఉంటాయని అంటున్నారు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా సినిమా విడుదల తేదీ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో బొగ్గు రైలు ఇంజన్ పైన ఓ వ్యక్తి నిలుచొని కనిపిస్తున్నాడు. బహుశా ఇది రవితేజ పాత్రనే అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ సినిమాను అక్టోబర్ 20 న పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో ప్రకటించారు మేకర్స్. 


‘ధమాకా’ సినిమా తర్వాత రవితేజ సినిమా కెరీర్ మళ్లీ గాడిలో పడింది. వరుసగా హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక రీసెంట్ గా ‘రావణాసుర’ సినిమాలో నటించారు. ఈ మూవీను ఏప్రిల్ 7 న థియేటర్లలో విడుదల చేయనున్నారు. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కూడా రవితేజ నెగిటివ్ పాత్రలో నటించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీని తర్వాత వెంటనే దసరా పండుగ టార్గెట్ గా ‘టైగర్ నాగేశ్వరరావు’ ను రెడీ చేస్తున్నారు రవితేజ. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.  ‘కాశ్మిర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన అభిషేక్ పిక్చర్స్ ఈ మూవీను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.