కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. సెప్టెంబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా తెరకెక్కించడానికి ఆయన చాలా కష్టపడ్డారు. లైకా ప్రొడక్షన్స్ సహాయంతో తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించారు మణిరత్నం. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
నిజానికి ఈ సినిమాను తెరకెక్కించాలని చాలా మంది దర్శకులు, హీరోలు అనుకున్నారు. అప్పట్లో కోలీవుడ్ స్టార్ హీరో ఎంజీఆర్ 'పొన్నియిన్ సెల్వన్' తీయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ కుదరలేదు. ఆ తరువాత మణిరత్నం కూడా ఈ సినిమా తీయాలని ఎన్నో ఏళ్లు ప్రయత్నించారు. ముందుగా రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్ కాంబినేషన్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నారు. కానీ సెట్ కాలేదు.
ఆ తరువాత విజయ్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఈ చారిత్రాత్మక సినిమా చేయాలనుకున్నారు. బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా స్టార్ట్ కాలేదు. కోలీవుడ్ మార్కెట్ పరంగా చూస్తే మణిరత్నం అడుగుతున్న బడ్జెట్ వర్కవుట్ కాదని నిర్మాతలు వెనుకడుగు వేశారు. అయితే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాలు ఇచ్చిన స్పూర్తితో నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి సిద్ధమవుతున్నారు.
మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్'ను నిర్మించడానికి లైకా ప్రొడక్షన్స్ ఒప్పుకుంది. కానీ విజయ్, మహేష్ లతో ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడం కుదరలేదు. ఫైనల్ గా విక్రమ్, కార్తీ, జయం రవి, శరత్‌కుమార్, ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రమ్ ప్రభు వంటి స్టార్స్ ను తీసుకున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మణిరత్నం అనుకున్నట్లు విజయ్, మహేష్ లతో ఈ సినిమా తెరకెక్కి ఉంటే బజ్ మాములుగా ఉండేది కాదు. రెండు ఇండస్ట్రీలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ వచ్చేది. ఇప్పుడు స్టార్ క్యాస్టింగ్ తోనే సినిమా తీశారు. మరి సినిమాకి ఎలాంటి సక్సెస్ వస్తుందో చూడాలి!