తెలుగు చలన చిత్ర పరిశ్రమ (Telugu Film Industry) లో సినిమా చిత్రీకరణలు నిలిచిపోయాయి. సమస్యల పరిష్కారం కోసం కొన్ని రోజులు షూటింగ్స్ బంద్ చేయాలని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Active Telugu Film Producers Guild) చేసిన ప్రతిపాదనకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber Of Commerce), తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (Telugu Film Producers Council) నుంచి మద్దతు లభించింది. థియేటర్స్ సమస్యలతో పాటు వీపీఎఫ్ చార్జీలను తగ్గించడం, థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో సినిమాలు విడుదల చేయాలనే నిబంధనతో పాటు మరికొన్ని అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. తాజా పరిస్థితిని వెల్లడించడం కోసం నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 


ఓటీటీ (OTT), వీపీఎఫ్ చార్జీలు (VPF Charges In Cinema), సినీ కార్మికుల వేతనాలతో పాటు థియేటర్ల సమస్య పరిష్కారానికి నాలుగు కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి సభ్యులు తెలిపారు‌.


గొడవలు లేవు - 'దిల్' రాజు
తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్‌తో కలిసి అన్నీ సమస్యలపై చర్చిస్తున్నామని తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని నిర్మాత 'దిల్' రాజు తెలిపారు. ‌తెలుగు సినిమా పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సుప్రీమ్ అని ఆయన అన్నారు.  ప్రస్తుతం అన్ని సినిమాల షూటింగులు ఆగాయని, త్వరలోనే సమస్యలను పరిష్కరించి, చిత్రీకరణలు పునః ప్రారంభిస్తామని ఆయన వివరణ ఇచ్చారు.


''నిర్మాతల సమస్యల పరిష్కారానికి ఇది తొలి అడుగు. త్వరలో చిత్ర పరిశ్రమ సమస్యలు అనీ తీరబోతున్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో చిత్ర పరిశ్రమకు పునర్వవైభవం రాబోతుంది'' అని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్, నిర్మాతల మండలి  గౌరవ కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపారు. 


'దిల్' రాజుపై కొందరు ఆగ్రహం  
షూటింగ్స్ బంద్ చేయాలని పిలుపు ఇచ్చిన ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో కీలక సభ్యుడైన 'దిల్' రాజు తన సినిమా షూటింగ్ చేస్తున్నారని కొంత మంది ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు వంశీ పైడిపల్లితో ఆయన నిర్మిస్తున్న 'వారసుడు' షూటింగ్ జరుగుతోంది.


Also Read : 'మా'లో సభ్యులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వండి - నిర్మాతలకు విష్ణు మంచు రిక్వెస్ట్, 'దిల్' రాజుతో డిస్కషన్ 


ధనుష్ హీరోగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న 'సార్' షూటింగ్ కూడా జరుగుతోన్న సమాచారం. విమర్శలు వచ్చిన తర్వాత తెలుగు సినిమా షూటింగులు మాత్రమే బంద్ చేశామని, తమిళ సినిమా కాబట్టి 'వారసుడు' షూటింగ్ చేస్తున్నామని 'దిల్' రాజు వివరణ ఇచ్చినట్లు ప్రెస్ నోట్ వచ్చింది.


Also Read : ప్రశాంతంగా సాగిపోవాలంటే కెలక్కూడదు! కెలికారో? - సత్యదేవ్ ఫుల్ యాక్షన్ మోడ్